లోపాలు లేని ఓటర్ల జాబితా అనేది ఎన్నికల సంఘం ప్రధాన విధి. ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఎన్నికల సంఘం గుప్పిట్లోకి వచ్చేలా రాజ్యాంగ నిర్మాతలు చేసింది అందుకే. ఓటర్ల జాబితాల నుంచి తీసేసిన వారి పేర్లను కూడా ప్రకటించాలని సుప్రీంకోర్టు తాజాగా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఆదేశాలు ఇచ్చింది. నిజానికి ఎన్నికల సంఘం ఇది ఎప్పుడో చేయాల్సింది. సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సినంత కాలం ఉండాల్సిన విషయం కాదు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఈసీ బాధ్యత
దేశంలో పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. భారతీయుడు అయి ఉండి.. పద్దెనిమిదేళ్లు నిండితే చాలు. ఇక మేర అర్హత ఉండాల్సిన పని లేదు. ఓటు హక్కు ఉంటుంది. ఈసీ కల్పించి తీరాలి. నిరాకరించకూడదు. అదే సమయంలో ఓటరు జాబితా నుంచి అన్యాయంగా తొలగించకూడదు. కారణం లేకుండా అసలు తొలగించకూడదు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లే.
దొంగ ఓట్లను తీసేయడం ఈసీ కర్తవ్యం
కారణం ఏదైనప్పటికీ మన దేశంలో ఓటర్ జాబితాలు లోపాలతో ఉంటున్నాయి. ఒక్కొక్కరు ఎక్కడ నమోదు చేసుకున్నా ఓటు ఇస్తున్నారు. గతంలో ఉన్న చోట తీసేయడం లేదు. ఫలితంగా ఓట్లు పెరిగిపోతున్నాయి. నగరాల్లో ఇలా ఉంటున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు పాపాలు చేస్తున్నాయి. తిరుపతి ఉపఎన్నికల కోసం .. ఐఏఎస్ అధికారి డిజిటల్ సిగ్నేచర్ వాడుకుని ముఫ్పై వేలకుపైగా దొంగ ఓట్లు ఒక్క నియోజకవర్గంలో తయారు చేశారు. ఇలాంటి స్వేచ్ఛ వారికి ఎలా వచ్చిందో కానీ.. ఇలాంటి అప్పులన్నీ సంస్కరించి.. ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేయడం అంటే దేశద్రోహంతో సమానంగా చూడాలి.
ఈసీపై జరుగుతున్న దాడికి సమాధానం చెప్పే చాన్స్
ఎన్నికల సంఘం పై స్థాయిలో తప్పులు చేయాలనుకున్నా సాధ్యం కాదు. కింది స్థాయి వాళ్లే చేయాలి. ఈ వ్యవస్థలో బీఎల్వోలు కీలకం. వారు రాజకీయ పార్టీల ప్రభావానికి లోనైతేనే సమస్యలు వస్తాయి. బీహార్ లో ఇప్పుడు తొలగించిన అరవై లక్షల ఓట్ల గురించి పూర్తి వివరాలు సుప్రీంకోర్టు బయట పెట్టమని ఆదేశించింది. ఎందుకు తొలగించారో స్పష్టం చేయమని చెప్పింది. విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే అవకాశం ఉంది. మొత్తం బయట పెట్టి.. పారదర్శకంగా పని చేస్తున్నామని నిరూపించి.. విశ్వాసాన్ని పెంచాల్సిన సమయం వచ్చింది.