తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ చేసిన పంచాయితీ రాజ్ చట్టంలో రిజర్వేషన్లు అన్నీ 50శాతం లోపే ఉండాలని ఉందన్నారు. ఆ చట్టమే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు అందకుండా అడ్డంకిగా మారిందని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల అంశంలో కేసీఆర్ చేసిన తప్పిదం వల్లే సమస్యలు వచ్చాయని తేల్చారు.
రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పడం ఇదే మొదటి సారి కాదు. అసెంబ్లీలోనూ చెప్పారు. ఢిల్లీ ధర్నాలోనూ చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అంతకు ముందే ఉమ్మడి రాష్ట్రంలో సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు.. యాభై శాతం లోపే రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది. దాంతో కేసీఆర్‌కూ తప్పలేదు.
అయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ తరపున కామారెడ్డి డిక్లరేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కేంద్రం అంగీకరించకపోవడంతో .. అమలు చేయలేకపోతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు.. స్థానిక ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ రిజర్వేషన్ల అంశంపై ఏం చేద్దామన్నదానిపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోలేకపోయింది.