తాడిపత్రికి పోవడానికి చిన్నపాటి సమరమే చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి కలసి రావడం లేదు. హైకోర్టు సింగిల్ జడ్జి తాడిపత్రికి పెద్దారెడ్డి పోవచ్చని ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సోమవారం ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య ఆయన తాడిపత్రికి వెళ్లడానికి పోలీసులు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం పెద్దారెడ్డి ఉదయమే తాడిపత్రికి బయలుదేరారు. కానీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ శివుని విగ్రహం ఏర్పాటు చేసి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో తాడిపత్రిలోకి వెళ్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పెద్దారెడ్డిని మార్గమధ్యంలోనే ఆపేశారు. సాయంత్రం వరకూ రోడ్డుపైనే కూర్చున్న పెద్దారెడ్డి తర్వాత .. జేసీ ప్రభాకర్ రెడ్డికి శాపనార్ధానాలు పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని..సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలు, దాడులకు సమాధానాలు చెప్పే తాడిపత్రిలోకి అడుగు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నందుకు పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి.