అమరావతి రాజధాని ప్రాంతంలో లావాదేవీలు పెరుగుతున్నాయి. అయితే అక్కడ ప్లాట్లు కొనాలనుకునేవారిని సోషల్ మీడియా పోస్టులు భయపెడుతున్నాయి. అక్కడ అన్నీ మునిగిపోయాయని ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా ఉండేవారికి అసలు విషయం తెలుసు కానీ.. బయట వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
నిజానికి అమరావతి ప్రాంతంలో కొందరు రియల్టర్లు అత్యాశ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వన్లు వస్తే రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగా పండని ఈ భూములను రైతులు “బాడవ భూములు” అంటారు. రియల్టర్లు ఈ భూములను తక్కువ ధరకు కొని, వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. వీటికి సీఆర్డీఏ అనుమతులు కూడా ఉండవు.
అమరావతి, పెదకూరపాడు , తాడికొండ మండలంలో వందల ఎకరాల్లో లే అవుట్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల వేసవి కాలంలో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేస్తున్నారు. అలాంటివి ఈ వానా కాలంలో నీటిలో మునిగి ఉన్నాయి. కొంత మంది రియల్టర్లు వాగుల వెంబడి భూములు కొని, రోడ్లు, తాగునీటి ట్యాంకులు నిర్మించి సీఆర్డీఏ అనుమతులు తీసుకుంటున్నారు. గుంటూరు నుండి అమరావతి వెళ్లే దారిలో లాం దాటాక ఇరువైపులా ఆర్ అండ్ బీ కాలువలను పూడ్చివేశారు. ఆ స్థలాన్ని చదును చేసి వెంచర్లు వేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ప్లాట్లు కొనేముందు సీఆర్డీఏ అనుమతులు, భూమి సర్వే నంబర్లు తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్లు, ప్రకటనలపై ఆధారపడకుండా, స్థలాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే విషయం తెలిసిపోతుంది. అక్రమ వెంచర్లలో కొంటె ఎప్పటికైనా సమస్యలు ఎదురవుతాయి.