దర్శకుడు మారుతి స్టాంప్ వేసుకొన్న మరో సినిమా ‘బ్యూటీ’. మారుతి టీమ్ ప్రొడక్ట్స్ సంస్థ ఈ చిత్ర రూపకల్పనలో భాగం పంచుకొంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన సినిమా ఇది. వర్థన్ దర్శకుడు. టీజర్ ఈరోజు విడుదల చేశారు. ‘బ్యూటీ’ అనే యూత్ ఫుల్ టైటిల్ పెట్టినా – ఓ మధ్యతరగతి జీవితం, కన్న కూతురి ఇష్టాల కోసం తల్లిదండ్రులు పడే తపనే.. తెరపై కనిపించాయి. ఎమోషన్ డ్రైవ్ తో సాగే సినిమా అనిపించింది. వాసుకీ, నరేష్‌లు తల్లిండ్రులుగా నటించారు. వారి నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ఓ సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
”కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చిన కిక్కు.. ఓ మధ్యతరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడతాలి.. పడతాను” అంటూ నరేష్ చెప్పిన మాటలు ఈ కథకు మూలంగా అనిపిస్తోంది. కన్నకూతురి ఇష్టాల్ని తీర్చడానికి తల్లిందండ్రులు పడే కష్టాలే ఈ సినిమా. దాని వెనుక… ఓ ప్రేమ కథ, అందులో వచ్చే అలజడుల చుట్టూ ‘బ్యూటీ’ తిరగబోతోంది. ‘బేబీ’ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బులగానిన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.