తెలంగాణ అసెంబ్లీ సమావేశపర్చేందుకు ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఈ సారి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకే సభను సమావేశపరుస్తున్నారు. శనివారం ప్రారంభమయ్యే సభ నాలుగురోజుల పాటు జరుగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సభ్యులందరికీ ఇస్తారు. శనివారం ఆ రిపోర్టును సభ్యులకు ఇచ్చి .. స్టడీ చేసేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు నిర్వహించాలన్నది శనివారం రోజు బీఏసీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ చాలా సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో.. తమకు కూడా అలాంటి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ లేరు..అందుకే ఆయన కార్యాలయ వర్గాలు కూడా ఆ లేఖను తీసుకోలేదు. కానీ ఈ డిమాండ్ కోసం పట్టుబట్టే అవకాశం ఉంది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇస్తారా లేకపోతే..హరీష్ రావు, కేటీఆర్లలో ఎవరైనా ఇస్తారా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. కేసీఆర్.. తొలి రోజు సభకు హాజరయ్యే అవకాశం లేదని..చర్చ జరిగే రోజున హాజరయ్యే అంశంపై ఆయన పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండటం లేదు. పరిస్థితిని బట్టి.. అసెంబ్లీకి హాజరై తన వాదన వినిపించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ రాలేకపోతే దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకునే చాన్స్ ఉంది.