మిరాయ్ సినిమాకి ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంపాక్ట్ బడ్జెట్లో మంచి విజువల్స్‌తో సినిమాని ప్రజెంట్ చేశారని ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం చర్చనీయాంశంగా ఉంది.
కిస్కింధపురి సినిమాను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక వీడియోనే రిలీజ్ చేశారు. ఆ సినిమా గురించి చిన్నపాటి రివ్యూ ఇచ్చారు. కిస్కింధపురి నిర్మాత సాహుతో మన శంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నారు చిరు. ఆ రకంగా తన నిర్మాత కోసం చిరు మాట సాయం చేశారని అనుకోవాలి.
తాజాగా మహేష్ బాబు రెండు వారాల క్రితం వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాపై పొగడ్తలు కురిపించారు. నిజానికి లిటిల్ హార్ట్స్ కూడా మంచి సినిమానే. మహేష్ పాజిటివ్ రివ్యూ ఇవ్వడం ఆ సినిమాకి మరింత కొత్త ఊపిరిని ఇచ్చింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ నుంచి మిరాయ్ గురించి పెద్దగా ప్రశంసలు రాలేదు. నాని లాంటి హీరోలు తప్పితే అగ్ర హీరోలు నుంచి స్పందన లేదు.
నిజానికి మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇండస్ట్రీలో కీలకమైన మనిషే. ఆయన నిర్మాణంలోనే దాదాపుగా ఒక అరడజను సినిమాలు ఉంటాయి. ప్రభాస్‌తో వాయిస్ ఓవర్ చేయించగలిగారు. నిన్న బాబీ, సందీప్ రాజ్లాంటి దర్శకులు మిరాయ్ సక్సెస్ మీట్‌కి వచ్చారు. అంతకుమించి స్టార్ బజ్ కనిపించలేదు. ఇండస్ట్రీలో ప్రశంసకి, మాట సాయానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయనే వాస్తవానికి ఈ పరిస్థితి అద్దం పడుతోంది.
కొసమెరపు: రెండు వారాల క్రితం విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడటంతో మళ్లీ హనుమాన్, గుంటూరు కారం గురించి ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అదొక ముచ్చట.
