లక్షలాది భక్తులకు సేవలు అందించే భారతదేశంలోని ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విప్లవాత్మక అభివృద్ధి జరుగుతోంది. దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎన్ఆర్ఐలు సహకారం అందించారు. దాదాపుగా 30 కోట్లు ఖర్చుతో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరించడం, క్యూలు నిర్వహణ, భద్రత , సైబర్ భద్రత వంటి అంశాల్లో AI సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకుంటారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ 50,000 నుంచి 1 లక్ష మంది వరకూ వస్తూంటారు. రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తుల సమయం ఆదా చేసేందుకు వేగంగా దర్శనం కల్పించేందుకు..భక్తుల అవసరాలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని టీటీడీ నిర్ణయించింది. రియల్-టైమ్ 3D మ్యాపులు, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత, రద్దీ నిర్వహణ వ్యవస్థలు , సైబర్ దాడుల నుంచి రక్షణ వంటి అధునాతన ఫీచర్లతో ఏఐ సెంటర్ ఏర్పాటుకు దాతలు ముందుకు రావడంతో వేగంగా పూర్తి చేశారు ఇందులో హై-కెపాసిటీ స్కానర్లు , ఇంటిగ్రేటెడ్ సర్వెయిలెన్స్ నెట్వర్క్ కూడా ఉంటాయి.
ఈ ప్రాజెక్టు కోసం టీటీడీ రూపాయి కూడా ఖర్చుచేయలేదు. ఎన్ఆర్ఐ దాతల సాయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ తిరుమలను మరింత ఆధునీకరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 25, 2025న ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఇదే రోజు టీటీడీ పోలీస్ అదనపు కమాండ్ భవనం కూడా ప్రారంభం కానుంది. ఈ అభివృద్ధి తిరుమలను AI యుగంలోకి తీసుకెళ్తూ, భక్తుల సౌకర్యాన్ని మరింత పెంచుతుంది. ఈ సెంటర్ సేవలు ప్రారంభమైన తర్వాత భక్తుల దర్శనాలు మరింత సులభతరమవుతాయి మరియు భద్రతా సమస్యలు తగ్గుతాయి.
