ఏఐ వీడియోల భయంలో సెలబ్రిటీలు కంగారు పడిపోతున్నారు. తమ ఫోటోలు వాడుకుంటూ కొందరు ఏఐ మార్ఫ్డ్ ఫోటోస్, వీడియోలు క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం, తమ ఇమేజ్ ను దుర్వినియోగం చేయడం చేస్తన్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరందర్నీ కంట్రోల్ చేయడానికి న్యాయపరంగా ముందుకు వెళ్తున్నారు.
తాజాగా నాగార్జున ఈ ఏఐ ట్రెండ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘యాక్టర్‌గా ఇప్పటికే ఆన్ లైన్లో ఉన్న ఫోటోలు, వీడియోలను AI ద్వారా మార్ఫింగ్ చేసి నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాని ఆధారంగా డబ్బులు సంపాదిస్తున్నారని పిటిషన్ వేశారు. ఆ వీడియోలు ప్రమోషన్లుగా వాడుతున్నారు. తన హ్యాష్ ట్యాగ్‌తోనే వీటిని మార్కెటింగ్ చేస్తున్నారని.. ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ను ఇలా తప్పుడు మార్గంలో ఉపయోగించి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారు పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనుమతి లేని ఫోటోస్, కంటెంట్‌తో తన ఇమేజ్ ప్రమాదంలో పడిందని నాగార్జున తరపు లాయర్ వాదించారు.
నాగార్జునకు న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రక్షణ కల్పిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఏఐ వచ్చిన తర్వాత పెద్ద సమస్యగా తయారైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ వంటి వారు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి తమ ఫోటోలు, వీడియోలను ఏఐ క్రియేటర్లు వాడకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్లు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు.
ఏఐ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. నిజమేదో.. ఏఐ ఏదో తెలియని విధంగా వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. అందుకే కేంద్రం ఏఐని నియంత్రించే చట్టంపై ఆలోచన చేస్తోంది.