కాంతార తెలుగులో పెద్ద హిట్. కన్నడలో విడుదలైన వారం తరవాత తెలుగు డబ్బింగ్ వచ్చింది. ఇదో కన్నడ సినిమా అనీ, రిషబ్ శెట్టి పరాయి హీరో అని అస్సలు అనుకోలేదు. తెలుగువాళ్లంతా ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కోసం కూడా అంతే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వాళ్లకు సినిమాపై ఉన్న ప్రేమ అది. రిషబ్ అనే కాదు, కన్నడ సినిమా అనే కాదు. ఎక్కడ నుంచి ఎలాంటి మంచి సినిమా వచ్చినా, అందులో ఎవరు నటించినా ఇంతే గొప్పగా ఆదరిస్తారు. అది మన గొప్పతనం.
అందుకే తెలుగు నాట ప్రచార కార్యక్రమాలకు వచ్చేటప్పుడు పర భాష హీరోలు, హీరోయిన్లు.. ఇక్కడి ప్రేక్షకుల మనసుల్ని గెలచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా కాస్తో.. కూస్తో తెలుగు నేర్చుకొని, నాలుగు ముక్కలు మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. కార్తి, సూర్య, విక్రమ్, కమల్… వీళ్లంతా తమ స్పీచ్ పూర్తిగా తెలుగులోనే ఇస్తారు. కానీ కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ లో రిషబ్ శెట్టి ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడలేదు. తన స్పీచ్ అంతా కన్నడలోనే సాగింది. కనీసం రిషబ్ స్పీచ్ ని ఎవరూ అనువాదం చేయలేదు. అక్కడ ఎన్టీఆర్ ఉండనే ఉన్నాడు. రిషబ్ కోరితే… ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ ని తెలుగులో ట్రాన్స్ లేట్ చేయగలడు. రిషబ్ కి కన్నడ తప్ప వేరే భాష రాదా అంటే.. ఆయనకు శుభ్రంగా ఇంగ్లీష్ వచ్చు. తమిళ నాడు వెళ్లి తమిళంలో మాట్లాడాడు. ముంబైలో హిందీ దంచి కొట్టాడు. తెలుగు మాత్రం మాట్లాడడు అంతే.
రిషబ్ శెట్టి తన స్పీచ్ పూర్తిగా కన్నడలో కొనసాగించడం తెలుగువాళ్లకు నచ్చడం లేదు. కనీసం రెండు ముక్కలైనా నేర్చుకొని, వేదికపై వల్లించే ప్రయత్నం చేయలేదన్నదే బాధ. కన్నడలో తెలుగు సినిమాల్ని డబ్ చేయరు. అక్కడ కన్నడ భాషా చిత్రాలకే ప్రాధాన్యత. భాషపై వాళ్లు చూపించే ప్రేమ అది. అదే ప్రేమ తెలుగు వాళ్లకు ఉండదా? కన్నడ సినిమాలకు, రిషబ్ శెట్టి లాంటి వాళ్లకు తెలుగు నుంచి వచ్చే వసూళ్లు కావాలి కానీ, తెలుగు అక్కర్లేదా? తెలుగు నుంచి వచ్చే డబ్బులు కావాలి కానీ, ఇక్కడి భాషా ప్రేమికుల బాధ పట్టదా? కనీసం కాంతారని అంత పెద్ద హిట్ చేసినందుకైనా తెలుగు ప్రేక్షకులపై కృతజ్ఞత చూపించుకోవాల్సిన అవసరం లేదా? ప్రస్తుతం తెలుగువాళ్లలో ఇదే చర్చ నడుస్తోంది. రిషబ్ ఎంత గొప్ప నటుడైనా కావొచ్చు, ఎంత గొప్ప సినిమా అయినా తీసి ఉండొచ్చు. కానీ తెలుగువాళ్ల మనోభావాల్ని వాళ్లకు భాషపై ఉండే అభిమానాన్ని కూడా ఆయన గౌరవించి తీరాలి. ఇక ముందైనా ఆయన తెలుగునాట అడుగుపెట్టేటప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకొంటే మంచిది.