‘తెలుగు ప్రేక్షకులకున్నంత పెద్ద మనసు ఎవరికీ లేదు…’
చాలామంది చెప్పే మాట ఇది. ఆఖరికి పరభాష నుంచి వచ్చే హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇదే చెబుతారు. మన మనసెంత బంగారమో.
వాళ్లు చెప్పేది మాట వరసకు మాత్రం కాదు. అది అక్షరాలా నిజం. మనకు సినిమా నచ్చితే చాలు. అది తెలుగా, తమిళా అనేది చూడం. హీరో మనకు పరిచయం లేకపోయినా పర్వాలేదు. ఆదరిస్తాం. కాసులు కురిపిస్తాం. తమిళనాట యావరేజ్ గా నిలిచిపోయిన చాలా సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి కంటే ఇక్కడ వసూళ్లు బాగా వచ్చాయి. అదీ తెలుగు ప్రేక్షకుల గొప్పదనం.
అయితే దాన్నే అలుసుగా తీసుకొంటున్నారంతా. సినిమా అనే బలహీనతపై దెబ్బ కొట్టాలని, దానితోనే కాసులు పిండుకోవాలని చూస్తున్నారు. ‘కాంతార చాప్టర్ 1’ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు తావు ఇస్తోంది. ఓ తెలుగు సినిమా, అందులోనూ భారీ సినిమాకు రేట్లు పెంచినప్పుడు పెద్దగా తిరస్కారాలు ఎదురవ్వలేదు. నచ్చితే చూశారు. లేదంటే లేదు. కానీ ఇప్పుడు ఓ కన్నడ సినిమాని, ఇంతింత రేటు పెట్టి ఎందుకు చూడాలి? కన్నడ సినిమా కోసం వంద రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలన్నదే అసలు ప్రశ్న.
పరాయి సినిమాలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరీ అంత పెద్ద మనసు చూపించాల్సిన అసవరం ఏముంది? మన తెలుగు సినిమా తమిళంలోగానీ, కన్నడలో గానీ ఇదే రేటుకి టికెట్ కొని చూస్తారా? టికెట్ రేట్లు పెంచమని అక్కడి ప్రభుత్వాలని అర్థించగలమా? అసలు తెలుగు సినిమా అంటే కన్నడీగులకు గౌరవం ఉందా? వాళ్ల సినిమాల్ని ఆదరించినట్టుగా, గౌరవించినట్టుగా మన సినిమాల్ని వాళ్లు గౌరవిస్తారా? అలాంటప్పుడు.. తెలుగు వాళ్లు పరాయి సినిమాలపై అంత ఉదారత ఎందుకు చూపించాలి?
తెలుగు డబ్బింగ్ సినిమాలకు తమిళనాడులోనూ, కన్నడసీమలోనూ ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఎక్కువ. ఆ డబ్బులు అక్కడి ప్రభుత్వాలకు వెళ్తాయి. అలా మన సినిమాలపై ఆదాయం ఆయా ప్రభుత్వాలు చేసుకొంటుంటాయి. కానీ అక్కడి నుంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం అది తెలుగు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడాలా? `కూలీ` సినిమాకు టికెట్ రేట్లు పెంచినప్పుడు ఇదే గొడవ. `వార్ 2` విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఆ రెండు సినిమాలకూ కాస్తో కూస్తో మినహాయింపు ఇవ్వొచ్చు. `వార్ 2`లో ఎన్టీఆర్ హీరో. మన తెలుగు హీరో బాలీవుడ్ లో చేసిన తొలి సినిమా కాబట్టి గౌరవించుకోవచ్చు. `కూలీ`లో నాగార్జున ఉన్నాడు. కాబట్టి ఆ మినహాయించు ఇవ్వడంలో ఓ అర్థం ఉంటుంది. కానీ… `కాంతార` పరిస్థితి అది కాదుగా.
అసలు డబ్బింగ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచే సౌలభ్యం ఇచ్చేట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? అనేది ప్రధానమైన ప్రశ్న. ప్రభుత్వానికి, పెద్దలకు ఈ విషయమై ఎవరు గైడ్ చేస్తున్నారో, ఎవరు రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. పర భాషల్లో తెలుగు సినిమాకు సరైన గౌరవం లేదని మనవాళ్లే గొంతు చించుకొంటున్నారు. `సినిమా ఓ కళ. దాన్ని భాషలకు అతీతంగా చూడాలి` అనే పెద్ద మనసు మనకుంటే సరిపోదు. పక్క రాష్ట్రాల వాళ్లకూ ఉండాలి. పరస్పర గౌరవించుకొన్నప్పుడు ఎన్ని మినహాయింపులు ఇచ్చినా తప్పు లేదు. అంతేకానీ ఇలా ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకొంటూ పోతే… అసలు ఈ టికెట్ రేట్ల వ్యవహారం సగటు ప్రేక్షకుడికి అంతు పట్టక.. ఇదే గుది బండగా కనిపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే.. థియేటర్ల నుంచి ఓటీటీల వైపు ప్రేక్షకుడి చూపు మరలిపోయింది. ప్రతీ సినిమాకీ ఇలా ప్రేక్షకుడ్ని పిండేస్తే.. అసలుకే ఎవసరు రాక తప్పదు. తెలుగు ప్రేక్షకుడు బంగారు గుడ్డు పెట్టే బాతు టాంటి వాడు. వాడ్ని కాపాడుకోవాలే కానీ, చంపేసి పొట్ట కోసే పరిస్థితి రాకూడదు. అలా జరగాలంటే… ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరగా కళ్లు తెరవాలి. ఏ సినిమాకు రేట్లు పెంచాలి? దేని ధర అందుబాటులో ఉంచాలి? అనే విషయంపై సత్వరిగతన ఓ నిర్ణయం తీసుకోవాలి. లేదంటే.. ప్రేక్షకుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.