తమిళనాట పొత్తుల గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. విజయ్ ను ఏదో ఓ కూటమిలో చేర్చేందుకు కరూర్ ఘటన కేంద్రంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. డీఎంకేకు ప్రత్యామ్నాయం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం లేదు. డీఎంకేను వదిలేసి విజయ్ వెంట పడేందుకు కాంగ్రెస్ సాహసించదు. విజయ్ పొత్తులకు వ్యతిరేకం కాదు. కానీ ఆయన బీజేపీతో జత కట్టలేరు. అన్నాడీఎంకేతో మాత్రం కలసి పోటీ చేసేందుకు మొదటి నుంచి అనుకూలంగానే ఉన్నారు. కానీ అన్నాడీఎంకే బీజేపీతో కలిసింది.
అన్నాడీఎంకేతో పొత్తులకు రెడీ
ఇప్పుడు అన్నాడీఎంకే మరోసారి విజయ్ పార్టీతో టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ లేకుండా అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని విజయ్ సంకేతాలు ఇచ్చారు. కానీ బీజేపీ ఎవర్నీ వదలదు. ఆ పార్టీని వదిలేసేంత సాహసం అన్నాడీఎంకే చేయదు. ఉంటే.. బీజేపీతో కలిసి ఉన్న కూటమిలోనే విజయ్ చేరాల్సి ఉంటుంది. ఇప్పటికైతే.. సైద్ధాంతికంగా బీజేపీ శత్రువని విజయ్ ప్రకటించారు కానీ ఆ దిశగా ఆలోచనలు లేవు. కానీ కరూర్ ఘటన అనంతరం.. విచారణ ఇతర విషయాలతో విజయ్ ఒత్తిడికి గురవుతున్నారు. ఆయనకు మద్దతు అవసరం వచ్చింది.
భావజాల సమస్య రాదని విజయ్‌కు నచ్చ చెబుతున్న పెద్దలు
అన్నాడీఎంకే .. విజయ్ ను మెత్తబరిచేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ కూటమిలో ఉన్నా.. ఆ పార్టీ భావజాలం కూటమిపై ఉండదని.. కేంద్రంలో మద్దతు కోసమే ఎన్డీఏలో ఉంటామని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాల్లో బీజేపీతో మైనర్ భాగస్వామిగా ఉందని.. అలాగే తమిళనాడులోనూ ఉంటుందని నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోలా విజయ్ ఇప్పుడు బీజేపీ విషయంలో అంత కఠినంగా లేరు. కరూర్ అనట అనంతరం ఏకపక్షంగా మద్దతుగా నిలిచారు ఆ పార్టీ నేతలు. అన్నామలై, ఖుష్బూ లాంటి వాళ్లకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఆయన మెల్లగా కరుగుతున్నారని బీజేపీకి క్లారిటీ వచ్చింది.
విజయ్ ఒంటరి పోటీ వల్ల డీఎంకేకే లాభం
తమిళనాడులో ఉన్న పరిస్థితుల కారణంగా రెండు కూటములు పోటీ పడితేనే హోరాహోరీగా పోరు సాగుతుంది. రెండు కూటములతో.. పాటు విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ పడితే.. ఓట్లు చీలిపోయి డీఎంకేకు భారీ మెజార్టీ లభిస్తుంది. ఈ అంశంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే విజయ్ కు స్పష్టత ఇచ్చారు. ఆయన కాదనడంతో విజయ్ పార్టీకి పని చేయడం మానేశారు. ఇప్పుడు విజయ్ కు అనివార్యత ఏర్పడుతోంది. అన్నాడీఎంకేతో అయితే ఓకే అన్నదాకా వచ్చారు.. కొన్నాళ్లకు.. బీజేపీ ఉన్నా పర్వాలేదనుకుంటారని తమిళనాడులో గుసగుసలు ప్రారంభమయ్యాయి.