కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి చిన్నా , పెద్ద టెండర్ మాకే కావాలంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. చివరికి మేడారం టెండర్లను కూడా తన సన్నిహితుడి కంపెనీకి దక్కేలా ప్లాన్ చేశారు. దీంతో వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన వేల కోట్ల ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టులు తీసుకుంటున్నారని చివరికి తమ జిల్లాలో చిన్న చిన్న టెండర్లను వదలడం లేదని వారు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.
కొండా మురళి ఈ టెండర్ల వ్యవహారంలో అసంతృప్తికి గురయ్యారు. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకున్నారని, మేడారం ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. కొండా దంపతులు ఈ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , మీనాక్షి నటరాజన్‌కు దృష్టికి తీసుకెళ్లారు.
ఒక్క మేడారం టెండర్లు మాత్రమే కాదు.. వరంగల్ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని.. రాజకీయ నేతల్ని తమకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని వారంటున్నారు. పొంగులేటి టెండర్ల వ్యవహారంపై రచ్చ జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కొంత మంది బయటపడలేకపోతున్నారు కానీ.. పొంగులేటి తీరుపై తోటి మంత్రుల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది.