కరూర్ తొక్కిసలాట ఘటన లో చనిపోయిన 41 మందిని పరామర్శించడానికి వెళ్లేందుకు విజయ్‌కు ధైర్యం చాలడం లేదు . కానీ పరామర్శించి వారికి సాయం చేయకపోతే ప్రజలు ప్రశ్నించడం ఆపే అవకాశం లేదు. అందుకే పరామర్శ కోసం కరూర్ లోనే ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఓ వేదికను ఏర్పాటు చేసి. .. అక్కడికే 41 కుటుంబాలను పిలిపించుకుని పరామర్శించి .. చెక్కులు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం పోలీసుల అనుమతి తీసుకున్నారు.
ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో బహిరంగంగా ప్రకటించరు. ఎలాంటి ర్యాలీలు ఉండవు. అలాగేజన సమీకరణ కూడా చేయరు. విజయ్ వస్తారు.. కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించి వెళ్తారు. ప్రభుత్వ ఒత్తిడితో ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నారా లేకపోతే ప్రజాగ్రహం పేరుతో తనపై ఇతర పార్టీల వాళ్లు దాడికి ప్లాన్ చేస్తారని భయపడి ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నారా అన్నదానిపై స్పష్టత రాలేదు. కానీ ఆయన ప్రోగ్రాం మాత్రం భయం వల్లనే ఇలా జరుగుతోందని ఎక్కువ మంది నమ్మేలా ఉంది.
మామూలుగా చావుల్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనుకునే రాజకీయ నేతలు.. ఓదార్పుయాత్రలు చేస్తారు. ర్యాలీలుగా వెళ్లి బాధితుల్ని పరామర్శించి.. లక్ష రూపాయల చెక్కులు ఇస్తారు. కానీ విజయ్ ఇరవై లక్షలు ఇవ్వాలనుకుంటున్నా.. ర్యాలీగా వెళ్లాలని అనుకోవడం లేదు. పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆయన కూడా తగ్గాలని అనుకుంటున్నారు. అదే సమయంలో విజయ్ ప్రజల్లోకి వెళ్లడం ఇప్పుడల్లా సాధ్యమవుతుందా లేదా అన్నది కూడా అర్థం కావడం లేదు. ప్రత్యేక నిబంధనలు రూపొందించేదాకా ఇలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.