పాకిస్తాన్ .. ఎప్పుడూ ఏదో ఒకటి చేసుకుని పొరుగు దేశాలతో యుద్ధాల వరకూ తెచ్చుకుని తల బొప్పి కట్టించుకోవడం మానడం లేదు. తాజాగా ఆప్ఘనిస్తాన్ తో యుద్ధానికి పాక్ సిద్ధమవుతోంది. ఆఫ్ఘన్ ను పాలిస్తున్న తాలిబన్లతో గొడవలు పెట్టుకుంది. ఒకప్పుడు తాలిబన్ల సాయంతో ఇండియాపై కుట్రలు చేయాలనుకుంది. కానీ ఇప్పుడు తాలిబన్లు భారత్ తో సన్నిహితంగా ఉండి.. పాకిస్తాన్ సంగతి చూస్తామంటున్నారు.
పాక్ , ఆఫ్ఘన్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. దానిపై వివాదాలున్నాయి. ఇవి పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్నాయి. గతంలో ప్రజా ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా అలజడి రేగేది కాదు. కానీ ఇప్పుడు తాలిబన్లు వచ్చిన పరిస్థితి మారింది. తాలిబన్లు ఆప్ఘన్ ను స్వాధీనం చేసుకున్నా.. పాకిస్తాన్ వారిని ఆదరించింది. వారి సాయంతో భారత్ పై కుట్రలు చేయాలనుకుంది. అందుకే తాలిబన్లను పెద్ద ఎత్తున తమ దేశంలోకి ఆహ్వానించింది. 30 లక్షల మంది ఆప్ఘన్ వాసులు పాక్ లోకి వచ్చారు. వారంతా సరిహద్దు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు.
వారంతా రాను రాను ఏకు మేకులయ్యారు. పాకిస్తాన్ పైనే దాడులు చేయడం ప్రారంభించారు. తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ పేరుతో సంస్థగా ఏర్పడి పాక్ లో అరాచకం ప్రారంభించారు. దాంతో పాక్ వారందర్నీ తరిమేయాలని అనుకుంది. కానీ అదంతా సాధ్యం కావడం లేదు. పాక్ లో అలజడికి టీటీపీ కారణం అవుతోంది. ఇటీవల ఆప్ఘన్ సరిహద్దులో ఓ గ్రామంపై వైమానిక దాడి చేసి 30 మందిని పాక్ చంపేసింది. వారంతా ఉగ్రవాదులని అంటోంది. కానీ సొంత పౌరుల్ని చంపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పుడు తాలిబన్లు భారత్ జోలికి రాబోమని.. తమకు అండగా ఉండాలని సంకేతాలిస్తున్నారు. తాలిబన్ల విషయంలో భారత్ తటస్థంగా ఉంది. ప్రజా ప్రభుత్వానికి అంతకు ముందు భారత్ సహకరించింది. తాలిబన్లకు మద్దతు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు .. కాగల కార్యం తాలిబన్లు తీర్చేలా ఉండటంతో.. పరోక్షంగా అయినా సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కు తాలిబన్లే పెద్ద సమస్యగా మారారు.