“ ఇన్ఫోసిస్ ఆంధ్రాకు వెళ్లిపోతుందేమో” అని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కర్నాటక మంత్రులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పారిశ్రామికవేత్తలపై విరుచుకుపడుతున్నారు. చివరికి కులగణన చేయడానికి సోషియో ఎకనామిక్ సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలు సేకరిస్తూండటంతో .. అందులో వివరాలు ఇచ్చేందుకు నారాయణమూర్తి దంపతులు నిరాకరించారు. దాంతో సీఎం సహా ఇతర మంత్రులు వారిపై విరుచుకుపడ్డారు. ఈ కారణంగానే.. కుమారస్వామికి ఇన్ఫోసిస్ ఆంధ్రాకు వెళ్లిపోతుందేమో అనే డౌట్ వచ్చింది. ఆంధ్ర మాత్రమే ఎందుకు అన్న దానికి ఇక్కడ ఒక్కటే సమాధానం ఇప్పుడు .. పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రా.
పారిశ్రామికవేత్తలకు మొదటగా గుర్తుకు వస్తున్న ఆంధ్రా !
ఇప్పుడు ఎలాంటి ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా ప్లాంట్, ఫ్యాక్టరీ ,ఆఫీసు పెట్టాలనుకుంటే పారిశ్రామికవేత్తలు మొదట ఏపీ వైపు చూస్తున్నారు. అలా ఎకోసిస్టమ్ ఏర్పాటు దిశగా నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. బెంగళూరులో పడుతున్న సమస్యలను తప్పించుకోవాలంటే ..ఏపీకి రావాలని లోకేష్ ఆహ్వానిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా.. తమ పెట్టుబడులు ఏపీలో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని అనుకుంటున్నారు. రాజకీయ నేతల మైండ్స్ లోనూ అదే పడిపోయింది. అందుకే… పెట్టుబడులు, పరిశ్రమలు అంటే ఆంధ్రా అనే మొదట అంటున్నారు.
మెల్లగా మెరుగుపడుతున్న ఏపీ ఎకో సిస్టమ్
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రధానమైన ప్లస్ పాయింట్ తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతాన్నే ప్లస్ గా చేసుకుని అద్భుతమైన వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ తీర ప్రాంతమే ప్లస్ పాయింట్ గా ఏఐ హబ్ వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తున్నాయి. రాయలసీమ వైపు తయారీ రంగ కంపెనీలు చూస్తున్నాయి. నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సు లోకేష్ బిల్జ్ చేస్తున్న ఈ ఎకోసిస్టమ్ ఎంత బాగా ఆంధ్రాను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుందో మరింతగా అందరికీ అర్థమవుతుంది.
ఏడాదిలోనే ఎంత మార్పు ?
జాకీ పరిశ్రమను తరిమేశారు. అమరరాజాను వేధించి తెలంగాణకు పంపేశారు. ఇలా వైసీపీ హయాంలో చెప్పుకుంటే వచ్చినవేవీ లేవు సరి కదా.. అంతకు ముందు ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల్ని తరిమేశారు. చివరికి కియాకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ ను కూడా తప్పు పట్టారు. ఆ పరిశ్రమనూ వెళ్లగొట్టాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక వర్గాల్లో ఏపీపై ఎలాంటి ఇమేజ్ పడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితిని మార్చి.. పెట్టుబడులు, కార్యాలయాలు అంటే అందరికీ మొదటగా ఏపీ గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘనత నారా లోకేష్‌దే. ఏపీ పరుగు ఇపుడే ప్రారంభమయింది. ముందు ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.