తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా చాలా మంది ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో కేసీ వేణుగోపాల్ .. ఇతర నేతలు చర్చలు జరిపారు. డీసీసీ అధ్యక్షుల కోసమని వారు చెబుతున్నారు. అదే నిజం అయితే.. జిల్లా అధ్యక్షులను కూడా హైకమాండ్ స్థాయిలో నిర్ణయించాల్సి వస్తే .. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ డీసీసీ అధ్యక్షులే కాదు.. ఇటీవల కాంగ్రెస్ లో జరుగుతున్న అన్ని అంశాలపైనా హైకమాండ్ సమీక్ష చేసినట్లుగా చెబుతున్నారు.
రేవంత్‌ను బలహీనం చేయడం అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడమే!
రేవంత్ రెడ్డి తనకు నిర్ణయాలు తీసుకోవడంపై సరైన స్వేచ్ఛ ఇవ్వకపోవడం.. వివిధ వర్గాలను పంపించి పాలనలో జోక్యం చేసుకునేలా చేయడంతో తాను ఎంత ఇబ్బంది పడుతున్నది రేవంత్ హైకమాండ్ కు గట్టిగా వివరించినట్లుగా చెబుతున్నారు. ఓ ముఖ్యమంత్రిపై.. కేబినెట్ మంత్రి కుమార్తె ఘోరమైన ఆరోపణలు చేస్తే.. ఆమెను తప్పించకుండా బుజ్జగించడం అంటే.. ఆ ముఖ్యమంత్రికి పవర్ ఉన్నట్లా లేనట్లా అన్నది ప్రజలు ఎలా తీసుకుంటారో ఆలోచించాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం విషయంలో తనకు పట్టు లేకపోతే పాలన ఎలా సాగుతుదంని ఆయన గట్టిగానే అడిగినట్లుగా చెబుతున్నారు.
తన సమస్యలపై నివేదిక ఇచ్చిన రేవంత్
మరో వైపు హైకమాండ్ తనను బలహీన పరిచే విధంగా తనపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేరుగా వాదనలకు దిగకుండా.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా కావడానికి దారి తీసిన పరిస్థితులపై రేవంత్ వీలైనంత వరకూ పొలైట్ గానే నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ వద్ద తమకు మద్దతు ఉందన్న కారణంతో .. ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా కొంతమంది మంత్రులు చేసిన వ్యవహారాలను కూడా ఆయన హైకమాండ్ కు నివేదించినట్లుగా చెబుతున్నారు.
హైకమాండ్ గుర్తించకపోతే బాగు చేసుకోవడం కష్టమే !
పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఎన్నికల సమయంలో ఉన్న పాజిటివిటీ ఇప్పుడు లేదన్నది గుర్తు చేసుకోవాలని.. దానికి కారణాలేమిటో కూడా హైకమాండ్ గుర్తించాలన్నట్లుగా రేవంత్ రెడ్డి తన మాటలను చెబుతున్నారు. కానీ ఈ పరిస్థితులను తెచ్చిపెట్టింది హైకమాండే కాబట్టి.. రేవంత్ రెడ్డి మాటల్ని ఆలకిస్తుందా అన్నది కీలకమే. ఇప్పటికే .. హైకమాండ్ చింపిన విస్తరిగా తెలంగాణ కాంగ్రెస్ మారింది. రేవంత్ కష్టం.. బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. హైకమాండ్ చేసే రాజకీయాల వల్ల.. వచ్చే నష్టాలకూ రేవంతే బాధ్యత వహించాల్సి వస్తోంది.