ఈ ఏడాది ఏపీకి తొలి తుపాను ముప్పు వచ్చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఏపీలోనే తీరం దాటనుంది. అక్టోబర్ 28 సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం సోమవారం నుంచి గురువారం వరకూ ఉండనుంది. గంటకు 90-120 కిలోమీటర్ల వేగంతో గాలులు, 80-100 మి.మీ. మేర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ వర్షాలు పడతాయి. తెలంగాణనూ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు ప్రకటించారు. 25న తీవ్ర వాయుగుండంగా మారి, 26న తుపానుగా బలపడింది. 27న తీవ్ర తుపానుగా మారి, 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి విపత్తు తప్పదు కాబట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటం ముఖ్యమని.. ఇప్పటి నుంచే సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీరప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యా సంస్థలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. తాగునీరు, విద్యుత్, మొబైల్ సేవలు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవలు సిద్ధం చేశారు.
అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దూర ప్రయాణాలు మానుకోవాలని, తాగునీరు, ఆహారం అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం సిద్ధమయింది.