వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నేరాలకు అరెస్టు అవడం లేదు. అత్యంత ఘోరంగా ఓడిపోయినా సరే.. తమ అరాచకాలను ఆపకపోవడం వల్లనే అరెస్టు అవుతున్నారు. వల్లభనేని వంశీ అయినా.. జోగి రమేష్ అయినా ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసి అడ్డోగలుగా తప్పుడు పనులకు పాల్పడటం వల్లనే అరెస్టు అయ్యారు. గతంలో చేసిన నేరాలకు మాత్రం అరెస్టు కాలేదు. ఆ విషయం వైసీపీ నేతలకూ ఓ క్లారిటీ ఉంది.
వంశీ.. జోగి పాఠాలు నేర్చుకోని రాజకీయ నేతలు
వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో చేసిన ఘోరాల గురించి అరెస్టు కాలేదు. ఆయనను అరెస్టు చేసి.. రఘురామకు జగన్ ఇచ్చిన తరహా ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకుంటే ఓడిపోయిన రెండో రోజే ఇచ్చేవారు. కానీ చట్టబద్ధంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఆయన ఏకంగా ప్రభుత్వంపైనే కుట్ర చేశారు. కేసును విత్ డ్రా చేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు. కానీ ప్రభుత్వంపై కుట్ర చేయడం అంటే.. స్వయంగా బొక్కలోకి వెళ్లడమేనని ఆయనకు తెలిసి వచ్చింది. వంశీ అనుభవాల నుంచి జోగి పాఠాలు నేర్చుకోలేదు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినటువంటి తీవ్రమైన కేసులు ఉన్నా సరే ఆయన ఇప్పటి వరకూ అరెస్టు కాలేదు. అదే ధైర్యంతో కుట్రలు చేయబోయి.. ఇప్పుడు లోపలికి వెళ్లాడు.
పాత నేరాలకు అరెస్టులు ప్రారంభించలేదు !
పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ .. ఇలా చాలా మంది వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహరించారు. పాత నేరాలకు వీరెవర్నీ అరెస్టులు చేయలేదు. కొత్తగా ఎవరైనా నేరాలకు పాల్పడితే మాత్రం ఎత్తేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విషయం వీరికి తెలుసుకాబట్టే.. వీలైనంత మౌనం పాటిస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఓ మాట మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. పాత నేరాలకూ.. చేసిన ఘోరాలకూ ట్రీట్ మెంట్ ప్రారంభించాలంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.
కక్ష సాధింపులే అయితే ఇంత సాఫ్ట్‌గా ఉండవుగా !
వైసీపీ నేతలు కక్ష సాధింపులు అని గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజంగా ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే వైసీపీ నేతలు తట్టుకునే పొజిషన్లో ఉండేవారు కాదేమో. ఎందుకంటే.. కక్ష సాధింపులు ఎలా చేయాలో జగన్ రెడ్డి చేసి చూపించారు. దానికి రెండాకులు ఎక్కువగానే చేయడానికి టీడీపీకి అవకాశం ఉంటుంది. కానీ వారు అలా అనుకోవడం లేదు కాబట్టే వైసీపీ నేతలు బతికి పోతున్నారు. కానీ వారు కక్ష సాధింపులంటూ మాత్రం రెచ్చిపోతున్నారు.
