ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలిగా పేర్కొంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన లోతైన దర్యాప్తులో, హత్య జరిగిన సమయంలో లక్ష్మీదుర్గ కారులోనే ఉన్నారని, సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని సిట్ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కోర్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లక్ష్మీదుర్గ ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె ఆచూకీ కోసం కాకినాడ, అడ్డతీగల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సాంకేతిక ఆధారాల ప్రకారం ఆమె నిరంతరం తన ప్రాంతాలను మారుస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల గాలింపు తీవ్రం కావడంతో లక్ష్మీదుర్గ కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసుల చేతికి చిక్కితే ఎదురయ్యే పరిణామాల కంటే, నేరుగా న్యాయస్థానం ముందు హాజరై బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడమే ఉత్తమమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏ క్షణమైనా కోర్టుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం కోర్టు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు.
