బండ్లన్న స్పీడే స్పీడు.. స్పీచే స్పీచు. మైకు పట్టుకొని ముందుకొస్తే.. పది మాటలు మాట్లాడితే అందులో బోలెడన్ని అర్థాలు, నానార్థాలు, పెడార్థాలు, పరమార్థాలూ ఉంటాయి. అందుకే బండ్ల గణేష్ ఎప్పుడు వేదిక ఎక్కినా కళ్లన్నీ అటువైపు తిరిగేస్తాయి. చెవులు ఎప్పుడూ లేనంతగా అలెర్ట్ అయిపోతుంటాయి. ‘కె.ర్యాంప్’ షీల్డ్ ఫంక్షన్ కోసం బండ్ల గణేష్ అతిథిగా వచ్చాడు. హీరో కిరణ్ అబ్బవరం ని పొగుడుతూనే.. ఓ హీరోపై సెటైర్లు వేశాడు.
”ఒక్క సినిమా హిట్టయితే లూజు ఫ్యాంట్లూ, కొత్త కొత్త చెప్పులూ, నెత్తిమీద క్యాపూ, కళ్లద్దాలూ, ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో” అంటూ ఓ యంగ్ హీరోని ఇమిటేట్ చేసి చూపించాడు బండ్ల. ”నీ స్టైలూ, నీ యాక్టింగూ అంతా స్క్రీన్ మీదమ్మా.. అంతేగానీ, చిరిగిన ఫ్యాంట్లు వేసుకోను.. లాగులు వేసుకోను.. వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు… ఒక్క హిట్టు కొట్టగానే రాజమౌళికి తీసుకురా.. సుకుమార్ ని తీసుకురా అంటే కుదరదు.. వాస్తవానికి దగ్గరగా ఉండాలి” అంటూ హితబోధ చేశాడు. దాంతో… హిట్టు రాగానే ఎగస్ట్రాలు చేసే ఆ హీరో ఎవరా అనే చర్చ ఇండస్ట్రీ లో మొదలైపోయింది.
నిజానికి యంగ్ హీరోలంతా ఇలానే ఉన్నారు. ఒకరినో ఇద్దరినో అనడానికి వీల్లేని పరిస్థితి. ఒక్క హిట్టు రాగానే దాదాపుగా అందరి కళ్లూ నెత్తిన ఎక్కుతున్నాయి. పెద్ద పెద్ద దర్శకులవైపు చూస్తున్నారు. బడ్జెట్లు పెంచుకొంటున్నారు. తాము ఎదిగింది చిన్న సినిమాతోనే అనే విషయం మర్చిపోతున్నారు. వాళ్లంతా బండ్ల స్పీచు విని.. భుజాలు తడుముకోవాల్సిందే. ప్రతీ హీరో ఎదగాలి.. పెద్ద సినిమాలు చేయాలి. ఇలా ఆశ పడడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే.. నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి. యాటిట్యూడ్ చూపిస్తే ఆకాశానికి ఎత్తిన వాళ్లే కిందపడేసి తొక్కేసే ప్రమాదం ఉంది. బండ్ల స్పీచులోని మర్మం ఇదే కావొచ్చు.
