ఒకప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే కళాకారుల కల. అవి కేవలం గౌరవం కాదు, దేశం, సమాజంపై కళాకారులు వేసే ముద్ర. కానీ నేడు ఆ ముద్ర పక్కదారి పడుతోందా? అనే ప్రశ్న తాజాగా ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది.
“జాతీయ అవార్డుల జ్యూరీలు రాజీ పడుతున్నారు, పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి అవార్డులు మమ్ముట్టి లాంటి కళాకారులకు అవసరం లేదు” అని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
జాతీయ చలనచిత్ర అవార్డులు ఒకప్పుడు సినిమా విలువలకు ప్రతీకగా నిలిచేవి. చరిత్రకు, సమాజానికి, దేశ స్థితిగతులకు అద్దం పట్టి ఆలోచింపజేసే సినిమాలకే ఈ అవార్డులు లభించేవి.
గతంలో జాతీయ అవార్డులు అందుకున్న చిత్రాలు, వాటి దర్శకులు, నిర్మాతలకు కొలమానాలు ఉండేవి కాదు. వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ఉండేవారు కాదు. వ్యక్తిగత ఎజెండా వుండేది కాదు. కొన్ని సినిమాలు సెన్సార్ తర్వాత విడుదల కూడా కాలేదు. ఒక పోస్టర్ కూడా అతికించకుండా, కేవలం నిజాయితీతో చేసిన ప్రయత్నాలకు అవార్డులు వచ్చిన సందర్భాలు అనేకం. కానీ ఇప్పుడు కమర్షియల్ హంగులు, స్టార్ పవర్, బాక్సాఫీస్ ఫలితాలు.. ఇవన్నీ జాతీయ అవార్డుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
సమాజాన్ని ప్రతిబింబించే, మనిషి మనసును తడిపే సినిమాలు అవార్డుల జాబితాలో కనిపించకపోవడం ఒక చేదు వాస్తవం. దేశం, సమాజం, మనిషి కథ చెప్పే దర్శకులు, సమాజంపై ప్రశ్నలు లేవనెత్తే రచయితలు, జీవితాన్ని నిజాయితీగా జీవించే నటులను గుర్తించడంలో జాతీయ స్థాయి అవార్డులు తడబడుతున్నాయనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ఓ స్టార్ నటిస్తే, పెద్ద ప్రొడక్షన్ ఉంటే, లేదా సోషల్ మీడియాలో ఉన్న హైప్, లాబీయింగ్.. ఇవన్నీ అవార్డులకు మార్గాలుగా కనిపిస్తున్నాయి. దీంతో సినిమాకు ఉన్న అసలు సారాన్ని కప్పేస్తున్నాయి.
కథ, నిర్మాణం, పాత్రల లోతు.. ఇవన్నీ పక్కదారి పడుతున్నాయి. ఇటీవలి అవార్డులు అందుకున్న సినిమాలు, నటీనటులను గమనిస్తే, సమాజంలోని వాస్తవాలు, ప్రజల భావోద్వేగాలను నిజాయితీగా చూపించే చిత్రాలు చాలా వరకు కనిపించవు.
ప్రకాశ్ రాజ్ మాటల్లో వాస్తవం ఉంది. ఆయన చెప్పినట్లుగా, జాతీయ అవార్డుల విషయంలో నిజాయితీ మసకబారినట్లు కనిపిస్తోంది. అసలైన సినిమా కళను స్వప్రయోజనాలు, వ్యక్తిగత అనుబంధాలు డామినేట్ చేస్తున్నాయి.
సినిమా సమాజాన్ని వెండితెర అనే అద్దంలో చూపిస్తుంది. ఒక సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వడం అంటే .. ఆ దేశం ఆ సినిమాని ప్రమోట్ చేయడం. అందుకే ఒక దేశం సినిమాను ప్రమోట్ చేసేప్పుడు ఎంతో బాధ్యతతో ఉండాలి. ఎలాంటి సినిమాలను, ఎలాంటి పాత్రలను జాతీయ సినిమాలుగా ప్రమోట్ చేస్తున్నామనే స్పృహ ఉండాలి మరి ఇప్పుడు జాతీయ అవార్డులు నిజంగా ఉత్తమ సినిమాలను సత్కరిస్తున్నాయా? లేక ప్రలోభాలకు లోనౌతున్నాయా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి.
