సినిమాలకు సగం బలం.. టైటిలే. మంచి టైటిల్ జనాల్ని థియేటర్లకు రప్పించగలదు. ఓ క్రేజీ టైటిల్ కావాల్సినంత పబ్లిసిటీ తీసుకురాగలదు. చిన్న సినిమాలకైతే టైటిలే అన్నీనూ. అందుకే టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు పలు రకాలుగా ఆలోచిస్తుంటారు. అయితే ఈమధ్య కొన్ని చిన్న సినిమాలు టైటిల్ విషయంలో వివాదాల్లో ఇరుక్కొంటున్నాయి. చివరి నిమిషంలో టైటిల్స్ మార్చాల్సివస్తోంది. లేదంటే సెన్సార్ తో పేచీ వస్తోంది.
ఈవారంలో విడుదల కాబోతున్న సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒకటి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగని ఈ సినిమాలో ఎక్కడా అడల్ట్ కంటెంట్ లేదట. కేవలం టైటిల్ వల్లే ఏ సర్టిఫికెట్ ఇచ్చామని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. టైటిల్ మారిస్తే.. క్లీన్ యూ ఇస్తామని ఆఫర్ చేసింది. టైటిల్ లో అంత బూతు ఏముందో తెలీక.. చిత్రబృందం జుత్తు పట్టుకొంటోంది. చివరి నిమిషంలో టైటిల్ మార్చడం అనేది.. కుదరని పని. అందుకే ఏ సర్టిఫికెట్ తీసుకొని సినిమాని రిలీజ్ చేయాల్సివస్తోంది.
‘చాయ్‌వాలా’ టైటిల్ తోనూ ఇదే గొడవ. చాయ్ వాలా పేరుతో వచ్చిన సినిమాని మేం సెన్సార్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పిందట. అసలు సినిమాలో ఏముందో చూసి, అప్పుడు మార్చమంటే మారుస్తామని చిత్రబృందం కాళ్లా వేళ్లా పడినా సెన్సార్ కనికరించలేదని తెలుస్తోంది ‘చాయ్ వాలా’ అనేది ఓ వ్యక్తి ఇమేజ్ ని ప్రతిబింబించేలా ఉందన్నది సెన్సార్ సభ్యుల వాదన. చివరికి ‘నవాబ్ కేఫ్’ అని పేరు మార్చారు. టీజర్ ని సెన్సార్ చేసేటప్పుడు రాని అభ్యంతరం సినిమాని సెన్సార్ చేసేటప్పుడు ఎందుకొచ్చిందన్నది నిర్మాతల మాట. ఇది వరకు ‘వానర’ టైటిల్ పై కూడా ఇలానే అభ్యంతరం చెబితే, ఆ టీమ్ పేరు మార్చుకోవాల్సివచ్చింది. చిన్న సినిమాలకు టైటిలే బలం. కానీ చివరి నిమిషంలో సెన్సార్ బోర్డు ఇలా అడ్డు పడితే వాళ్లంతా ఏమైపోవాలి? అప్పటి వరకూ టైటిల్ తోనే సినిమాని మార్కెట్ చేసుకొని ఉంటారు. టైటిల్ మార్చి, ప్రమోషన్లని మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాలంటే కుదరని పని. ఈ విషయంలో నిర్మాతలు బాగా నలిగిపోతున్నారు.
