కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రిలా యాక్టర్ కాకుండా డైరెక్టర్గా మారాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆయన తొలి చిత్రం ‘సిగ్మా’ ని నిర్మిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో. తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ షూటింగ్ విషయంలో సంజయ్ చాలా క్లారిటీ వున్నాడు. ఈ సినిమా 65 రోజుల్లో 95% షూటింగ్ పూర్తి చేసింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థ హ్యాపీగా వుంది.
ఒక డెబ్యుట్ డైరెక్టర్గా 65 రోజుల్లో 95% షూటింగ్ పూర్తి చేయడం మామూలు విషయం కాదు. పైగా చెప్పిన బడ్జెట్ లో సినిమా తీశారు. లైకాతో ఆయన దర్శకత్వ ప్రయాణం కొనసాగాలని లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఒక ప్రకటన కూడా వదిలారు. ట్రెజర్ హంట్, క్రిమినల్ హీస్ట్, యాక్షన్, అడ్వెంచర్ జానర్ లో సాగే సినిమా ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సందీప్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాడు. తను స్వతహాగా కష్టపడే హీరో. కాకపోతే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు. విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు దర్శకుడిగా మారుతున్నాడంటే, లైకా లాంటి నిర్మాణ సంస్థ అండగా నిలబడిందంటే టాప్ హీరోలతోనే ప్రాజెక్ట్ సెట్ చేయొచ్చు. కానీ సంజయ్ మాత్రం ఏరి కోరి సందీప్ కిషన్ ని ఎంచుకొన్నాడు. ఈ విషయంలోనూ సందీప్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సంజయ్ తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. విజయ్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం ఉంది. తనయుడ్ని ప్రమోట్ చేసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేయక తప్పదుగా.


