2025 ఫస్టాఫ్ ప్రారంభంతో పోలిస్తే.. ఆఖర్లో కాస్త ఆశాజనక విజయాలు అందుతున్నాయి. ఓ వారం కాకపోయినా, మరోవారం బాక్సాఫీసు దగ్గర సందడి కనిపిస్తోంది. చిన్న సినిమాలు సైతం మెరుస్తున్నాయి. నవంబరు, డిసెంబరు కొత్త సినిమాలు బయటకు రావడానికి మొరాయిస్తాయి. సినిమాలకు సంబంధించినంత వరకూ మంచి సీజన్ కాదన్నది నిర్మాతల భయం. కానీ ఈసారి మాత్రం వారం వారం సినిమాల జాతర కొనసాగుతూనే వుంది. ఈవారం కూడా చెప్పుకోదగిన స్థాయిలో చిత్రాలొస్తున్నాయి.
దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటించి, నిర్మించిన చిత్రం ‘కాంత’. భాగ్యశ్రీబోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఓ హీరోకీ, దర్శకుడికీ మధ్య నడిచే క్లాష్ ఇది. ఈగో సమస్య చుట్టూ తిరిగే కథ. టీజర్, ట్రైలర్, పాటలూ.. అన్నీ ఆకట్టుకొంటున్నాయి. దుల్కర్పై తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకం. తప్పకుండా మంచి కంటెంట్ తో వస్తాడన్న భరోసా వుంది. అదే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందని బాక్సాఫీసు నమ్ముతోంది. పైగా రానాకు తన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో తెలుసు. ప్రమోషన్స్ లో కాస్త వైవిధ్యం చూపిస్తే మంచి ఓపెనింగ్స్ తీసుకొనే అవకాశం ఉంది.
ఈవారం వస్తున్న మరో సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించారు. ఈనెల 14న వస్తోంది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా వుంది. సున్నితమైన అంశాన్ని వినోదం జోడించి తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. చిన్న సినిమాలకు ఇది మంచి సీజన్. స్టార్లు లేకపోయినా, కథలో బలం ఉంటే జనం చూస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. వీటితో పాటుగా ‘సీమంతం’, ‘జిగిరీస్’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.
ఆల్ టైమ్ క్లాసిక్ ‘శివ’ని కొత్త హంగులతో ఈనెల 14న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమా ప్రేమికులు, నాగ్ అభిమానులు ఈ సినిమాని రీ రీలిజ్ లో చూడాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. వాళ్లందరికీ ఇది పండగలాంటి వార్తే. పైగా ఈమధ్య రి రిలీజ్ సినిమాలకు ఊహించని స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. మరి శివ ఈ తరం ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి.


