2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మిగిల్చిన గాయం ఇంకా పచ్చిగానే వుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఓటమి అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆ చేదు జ్ఞాపకం ఇప్పటికీ అభిమానుల మనసుల్లో కదులుతూ వుంది. కానీ ఇప్పుడు అదే వేదికలో ఫైనల్ ఫిక్స్ చేశారు.
2026 ఐసీసీ టి20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంక కలిసి నిర్వహించనున్నాయి. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఆతిథ్యమిస్తుంది. ముంబై వాంఖడే స్టేడియం ఒక సెమీఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించడానికి ఎంపికైంది.
పాక్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది. భారతదేశం–పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్లో తలపడితే, ఆ మ్యాచ్ కొలంబోలో నిర్వహిస్తారు. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబైలోనే. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కి వస్తే ఆ మ్యాచ్ కూడా కొలంబోలో నిర్వహిస్తారు. ఇండియాలో అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వేదికగా మ్యాచులు జరుగుతాయి. శ్రీలంకలో కొలంబో , పల్లెకెలె, డంబుల్లాలో మ్యాచులు వుంటాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు.
అంతా బావుంది కానీ.. ఫైనల్ మ్యాచ్ కోసం మళ్ళీ అహ్మదాబాద్ ని ఎంచుకోవడమే ఫ్యాన్స్ కి అందోళనగా మారింది. అహ్మదాబాద్ స్టేడియంని ఇండియన్ క్రికెట్ కి తలమానికంగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ పిచ్ పై మన ప్లేయర్స్ కే పట్టులేదు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత అహ్మదాబాద్ వాసులే.. ‘పట్టులేని వేదికపైన ఫైనల్ మ్యాచ్ ఎందుకుపెట్టారని’ ఆక్షేపించారు.
నిజమే.. అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో క్లారిటీ లేదు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా మారిన అక్కడ పిచ్ చూసి మనోళ్ళు బిక్క మొహం వేశారు. ఇప్పుడు మళ్ళీ మరో వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ ని ఫిక్స్ చేశారు. బహుశా ఓడిన చోటే గెలవాలనే క్రీడాస్ఫూర్తి ఏమో కానీ.. ఇదంతా తెలివైన ఎంపిక కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


