రవితేజ, కిషోర్ తిరుమల సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమాకి ముందుగా ప్రచారంలో ఉన్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. గుడిలో వినిపించే భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే అనౌన్స్మెంట్ తో ఓపెన్ అయిన టైటిల్ గ్లింప్స్ రవితేజ వాయిస్ ఓవర్ తో ఆసక్తికరంగా అనిపించింది.
”ఈ అనౌన్స్మెంట్ మనలో చాలామంది చాలాసార్లు విని ఉంటాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే.. నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్ ఏఐ అన్నిటిని అడిగాను. మేబి వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్య పోయారేతప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి”.. ఇదీ టైటిల్ గ్లింప్స్ సారాంశం.
రవితేజ లుక్ కూల్ గా వుంది. కాస్త స్టయిలీష్ అవతార్ లో కనిపించారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ఇందులో హీరోయిన్స్. వెన్నెల కిషోర్, సత్య, సునీల్ లాంటి నటులు కూడా గ్లింప్స్ లో కనిపించారు. ఈ గ్లింప్స్, టైటిల్.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీల్ కలిగించాయి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకి మంచి గిరాకీ వుంటుంది. ఇంతపోటీలో కూడా సంక్రాంతికే సినిమాని తీసుకురావాలనే నిర్మాతల ఉద్దేశం వెనుక అసలు కారణం కూడా ఇదే. ఈమధ్య రవితేజకు వరుస ఫ్లాపులు తగిలాయి. తన జోన్, టోన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్లింప్స్ చూస్తే… ఆ మార్పు ఈ సినిమా నుంచే మొదలైందనిపిస్తోంది.


