తెలుగుదేశం పార్టీలో 48 మంది ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ సమావేశంలోనే కాదు..కేబినెట్ భేటీలో కూడా మంత్రుల వద్ద చంద్రబాబు ఈ ఎమ్మెల్యేల వ్యవహారశైలిని ప్రస్తావించారు. వీరందర్నీ అదుపులోకి పెట్టి..దారిలోకి తెచ్చే బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. అంతకు ముందు నారా లోకేష్ కూడా కొంత మంది మంత్రులతో సమావేశమైనప్పుడు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు రాజకీయాల్లో బేసిక్స్ తెలియనట్లుగా రాజకీయాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు కానీ.. నారా లోకేష్ కానీ వారు ఇలా చేస్తున్నారని వదిలేసే అవకాశం ఉండదు. సరైన షాక్ ట్రీట్ మెంట్ ఆ ఎమ్మెల్యేలకు రెడీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మిడిసిపడుతున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు
చంద్రబాబు నాయుడు అయినా నారా లోకేష్ అయినా పక్కా సమాచారం లేకుండా.. ఎమ్మెల్యేల విషయంలో ఇంత కటువుగా మాట్టాడరు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోని వారు తీరుపై అసహనంతో ఉన్నారు. దారికి వస్తారా.. దారి నుంచి తప్పించమంటారా అన్న పద్దతిలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వీరిలో అత్యధిక మంది మొదటి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లే. కొంత మంది పార్టీ కన్నా వ్యక్తిగత బలంతో గెలిచామన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా అందాయి. అందుకే అంత గొప్ప పోటుగాళ్లు అయితే బయటకు వెళ్లిపోయి సొంత రాజకీయాలు చేసుకోవాలని చంద్రబాబు నేరుగానే సలహాలిచ్చారు. అవి ఎవర్ని ఉద్దేశించి అన్నారో వారికి సూటిగా తగిలి ఉంటాయి.
ఇప్పటికే ప్రజలకు దూరమైన సంకేతాలు
చంద్రబాబునాయుడు టిక్కెట్ల కేటాయింపు సమయంలో అనేక రకాల సమీకరణాలు చూసుకున్నారు. అలాంటి సమీకణాల్లో కలసి వచ్చి టిక్కెట్ దక్కించుకున్న వారు గాల్లో గెలిచేశారు. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ గెలిచేశారు. ఇదే చాలా మందికి కళ్లు నెత్తికెక్కేలా చేసిందని అంటున్నారు. ఎమ్మెల్యేగా లభిస్తున్న అధికారంతో అహంకారానికి పోతున్నారు. ప్రజల్ని పట్టించుకోని స్థితికి వెళ్లారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అందుకే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు…ప్రాధాన్యత తగ్గించడం ద్వారా పరోక్ష సంకేతాలు పంపారు. వారిలో కొంత మందికి ఇప్పటికే ఉక్కపోత తెలిసి వస్తోంది. తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని.. పట్టించుకోవడం లేదని.. సమాచారం ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కానీ వారి దందాలు .. ఓవరాక్షన్ అంతా హైకమాండ్ కు తెలిసిపోయిందని మాత్రం గుర్తించడం లేదు.
మొహమాటాలే ఉండవు.. పార్టీనే ఫస్ట్
చంద్రబాబు ఇప్పుడు మొహమాటాలు పెట్టుకోవడం లేదు. అలాగని ఎవర్నీ కించ పర్చడం లేదు. ఒకటికి రెండు సార్లు చెప్పి చూస్తున్నారు. అవకాశాలు కల్పిస్తున్నారు. మారేందుకు సమయం ఇస్తున్నారు. ఆ విషయం వారు కనిపెట్టి తమను తాము మార్చుకుంటే.. చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని వారిపై తమ అభిప్రాయం మార్చుకుంటారు. మా సొంత బలంతోనే గెలిచామని అనుకునేవారికి.. ముందుగానే ఆ బలంతోనే..రాజకీయాలు చేసుకోమని బయటకు తోసేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే టీడీపీలో అసలైన చంద్రబాబు,లోకేష్ రాజకీయం ముందు ముందు నడవబోతోంది.


