ఈమధ్య ఓ వార్త టాలీవుడ్ అంతటా గట్టిగా చక్కర్లు కొట్టింది. ప్రభాస్ `స్పిరిట్`లో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన ప్రభాస్ తండ్రిగా కనిపిస్తారన్నది ఆ వార్త సారాంశం. నమ్మిన వాళ్లంతా ఈ వార్త విని ఆకాశంలో తేలియాడారు. ప్రభాస్ – చిరంజీవి.. వీరిద్దరినీ కలిసి వెండి తెరపై చూస్తే ఆ కిక్కే వేరు కదా. పైగా.. సందీప్ రెడ్డి చిరంజీవికి అతి పెద్ద ఫ్యాన్. అవకాశం ఉన్న ప్రతీసారీ.. తనలోని ఫ్యాన్ బోయ్ని బయటకు తీసుకొస్తుంటాడు. సందీప్ ఆఫీస్ లోనూ చిరు పోస్టర్ ఒకటి ఉంది. అది బాగా వైరల్ అయ్యింది కూడా. సందీప్ లాంటి ఫ్యాన్ బోయ్… తన దగ్గరకు వస్తే `నో` చెప్పే అలవాటు మెగాస్టార్ కి కూడా లేదు. కాబట్టి ఈ వార్త బాగానే నమ్మారు.
కానీ అది రూమరే అని తేల్చి పారేశాడు సందీప్ రెడ్డి వంగా. ‘స్పిరిట్’ లో మెగాస్టార్ లేరన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. వీలైతే.. మెగాస్టార్ తో సోలో సినిమానే చేస్తానని ప్రకటించాడు. నిజానికి ఇదే మంచి ఎత్తుగడ. చిరుతో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా సోలో సినిమానే చేద్దామనుకొంటారు. మల్టీస్టారర్ చేస్తే ‘ఆ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పాత్రని తక్కువ చేశారు’ అని అభిమానులు పోల్చి చూసుకొంటుంటారు. ఆ పోలిక చాలా ప్రమాదం. రాజమౌళిలాంటి దర్శకుడే.. ఆ ప్రమాదం నుంచి బయటకు రాలేకపోయాడు. కాబట్టి సందీప్ ఆ రిస్క్ చేయకపోవొచ్చు.
మెగాస్టార్ – సందీప్ కాంబో ఇప్పటికీ ఆన్ కార్డ్సే. ఎందుకంటే సందీప్ అంటే చిరుకి ప్రత్యేకమైన అభిమానం. రెండు సినిమాలతోనే ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేశాడు సందీప్. ఆ స్టామినా ఎలాంటిదో చిరుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, యంగ్ జనరేషన్ తో చిరులాంటి వాళ్లు సినిమాలు చేయాలి. అప్పుడే వాళ్లలోని కొత్త కోణాలు బయటకు వస్తాయి. చిరు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ‘స్పిరిట్’ తప్పిపోవొచ్చు. కానీ ఎప్పటికైనా ఈ కాంబో ఉండి తీరుతుందన్నది చిరు అభిమానుల ఆశ.


