విశాఖ సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే… పారిశ్రామిక తగ్గేదెలే అన్నట్టుగా విశాఖ నగరానికి పోటెత్తారు. ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
సగానికి పైగా ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి.
సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు. మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పంచుకునేందుకు కూడా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని, మేధావుల్ని, విదేశీ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించామని సీఎం తెలిపారు. శ్రీసిటిలో 240 యూనిట్లు ప్రస్తుతం ఉన్నాయి. మరో 4 వేల ఎకరాలను అందుబాటులోకి తెస్తున్నాం .. క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి దానిని మనం అందిపుచ్చుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 19-24 ఓ బ్యాడ్ పిరియడ్, పరిశ్రమల్ని మూసేయించారు. ఏపీ నుంచి తరిమేశారు. ఈ వ్యవహారాలన్నిటినీ 18 నెలల్లోనే సరిచేయగలిగామన్నారు. 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు కోటిమందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.


