కమల్ హాసన్ – రజనీకాంత్- సుందర్.సి కలయికలో సినిమా ప్రకటన వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళింది. ఈ సినిమాకి తాను దర్శకత్వం వహించడం లేదని సుందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అనూహ్యమైన, అనివార్య కారణాల వల్ల ఈ గొప్ప ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించలేకపోతున్నట్లు సుందర్ ప్రకటించారు.
ఈ ప్రకటన తర్వాత తమిళనాట రచ్చ రేగింది. సుందర్ ఫామ్ లో లేరు. లేడి ఓరియంటెడ్ సినిమాలు తీసుకుంటున్నారు. ఆయన తప్పుకోవడం మంచిదని కొందరు కామెంట్లు చేశారు. రజనీకి అరుణాచలం లాంటి క్లాసిక్ ఇచ్చిన సుందర్ ఖచ్చితంగా మరో మంచి సినిమా ఇచ్చేవారని ఇంకొందరు కామెంట్లు పెట్టారు.
ఇందులో పొలిటికల్ కోణం కూడా దూరింది. ఈ సినిమాకి కమల్ హసన్ నిర్మాత. ఆయన డీఎంకే పొత్తులో వున్నారు. సుందర్ భార్య ఖుష్బూ బిజెపి. ఇలాంటి కలయికలో సినిమా సెట్స్ పైకి వెళితే.. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లుగా అవుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో లాజిక్ అంతగా కనిపించడం లేదు. అలాంటిది ఏదైనా వుంటే అసలు ప్రకటనే రాదు.
సుందర్ వైదొలగడానికి కారణం స్క్రిప్ట్ అని.. సరైన కథ లేకపోవడం వల్లే ఆయన వైదొలిగారని ప్రచారం జరుగుతోంది. ఇది కాస్త నమ్మబుల్ గా వుంది. అయితే ఇప్పటికే విషయం పై పొలిటికల్ హీట్ మొదలైపోయింది. ఈ మేటర్ లో ఖుష్బూపై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ సినిమాలో ఖుష్బూను స్పెషల్ సాంగ్ చేయమన్నారని, అందుకే ఆమె భర్త ఈ చిత్రం నుంచి వైదొలగారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఖుష్బూ ఫైర్ బ్రాండ్. ఇలాంటి ట్రోల్స్ కి భయపడేరకం కాదు. దీనిపై చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నన్ను ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో అనుకున్నా’’ అంటూ బోల్డ్ ట్వీట్ పెట్టింది.
మొత్తానికి రజనీకాంత్ సినిమా తమిళనాట సినీ రాజకీయ రచ్చకు వేదికైయింది. ప్రస్తుతం మరో కథ, దర్శకుడి కోసం వెదుకుతున్నారు కమల్ హాసన్. రజనీ సినిమా అంటే ఓ రేంజ్ అంచనాలు వుంటాయి. అలాంటి ప్రాజెక్ట్ ని సెట్ చేయడం నిర్మాతగా కమల్ కి కూడా పెద్ద టాస్క్.

