కార్తికేయ 2 విజయం నిఖిల్ కి పాన్ ఇండియా బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ‘స్వయంభు’తో వస్తున్నాడు. ఇదొక హిస్టారికల్ యాక్షన్ ఎపిక్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం. ఈ రోజు రిలీజ్ డేట్ లాక్ చేశారు. మహాశివరాత్రికి ఫిబ్రవరి 13, 2026న విడుదల కానుంది. రెండు సంవత్సరాల ప్రయాణం,170 రోజుల షూటింగ్ తర్వాత చిత్రీకరణ పూర్తయిందని ఒక వీడియో రిలీజ్ చేశారు.
”ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం. వేల సవాళ్లు.. అదొక సామ్రాజ్యం. కోట్ల పెట్టుబడి.. ఇదే మా స్వయంభు.’అంటున్నాడు నిఖిల్. ఈ సినిమా కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ‘మన భారత దేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి రాజుల కథలో యుద్ధ గాథలో కాదు. మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథగా స్వయంభు తెరకెక్కించారు.
రిలీజ్ చేసిన వీడియోలో సినిమా స్కేల్ కనిపించింది. నిఖిల్ కెరీర్ లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ సినిమాని చెప్పొచ్చు. ఎపిక్ టచ్ వున్న సినిమాలకి ఈ రోజుల్లో డిమాండ్ వుంది. పైగా నిఖిల్ కి కార్తికేయ లాంటి విజయం ఉంది. హిందీలో కూడా సినిమాని మార్కెట్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో సినిమాకి గట్టిగానే ఖర్చు చేశారని ఈ వీడియోలో కనిపిస్తోంది. మొత్తానికి భారీ టార్గెట్ తోనే దిగుతోంది స్వయంభు.