వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజుల కిందట తమకు మాత్రమే సానుభూతి చూపించే మీడియా గొట్టాలను పిలిపించుకుని బిత్తర చూపులు చూస్తూ గద్గద స్వరంతో మాట్లాడారు. ఆయన మాటలు విన్న వైసీపీ నేతలకు గుండె జారిపోయి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంత కంగారు పడుతున్నారని చర్చించుకుని ఉంటారు. వారందరికి అర్థమయిందో లేదో కానీ వైసీపీ పూర్తి స్థాయిలో రౌండప్ అయిపోయింది. అధికారం ఉందని అడ్డగోలుగా చేసిన వ్యవహారాలన్నీ చుట్టేసుకున్నాయి. ప్రభుత్వం ఏ మాత్రం ఆవేశపడకుండా చట్టప్రకారం అందర్నీ రౌండప్ చేసేసింది. ఇప్పుడు ఎవరూ బయటపడే పరిస్థితుల్లో లేరు.
ప్రశాంతంగా ఉన్న ఒక్క వైసీపీ నేత ఉన్నారా?
జగన్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి వరకూ వైసీపీలో ఉన్న ఎవరూ ప్రశాంతంగా లేరు. పార్టీలో ఉన్నారో లేరో అన్నట్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రమే కాస్త రిలీఫ్‌గా ఉన్నారు. ఆయన ప్రెస్మీట్లకు పరిమితం అవుతున్నారు. ఆయన తెరవెనుక ఏం రాజకీయాలు చేశారో కానీ తెర ముందు మాత్రం వైసీపీ తరపున మాట్లాడటం మానేశారు. ఇంక ఒక్క వైసీపీ నాయకుడు కూడా ప్రశాంతంగా లేరు. అయితే పార్టీకి దూరమయ్యారు. లేకపోతే కేసుల పాలై జైళ్లు, బెయిళ్లు చుట్టూ తిరుగుతున్నారు. అంతటితో వారిపై కేసులు అయిపోయాయి.. ఇక ధైర్యంగా రోడ్డు మీదకు వస్తామన్న పరిస్థితులు లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమని చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిస్థితే గందరగోళం
జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం అరెస్టు చేయడం లేదా కొత్త కేసులు పెట్టడం వంటి దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కానీ స్విచ్ నొక్కితే ఆయన చుట్టూ కేసుల వలపడటానికి కావాల్సినంత నెట్ వర్క్ ఏర్పాటయిపోయింది.లిక్కర్ స్కామ్, వివేకా హత్య కేసు, పరకామణి కేసు, కల్తీ నెయ్యి కేసు ఇలా వరుసగా అన్నీ జగన్ రెడ్డిని చుట్టుముట్టడానికి రెడీగా ఉన్నాయి. సరైన సమయం కోసం చూస్తున్నారు అంతే. ఈ విషయం జగన్‌కు తెలుసు కాబట్టే బెంగళూరులో ఎక్కువ సమయం టైంపాస్ చేస్తున్నారు. బెట్టింగుల్లో సర్వం కోల్పోయిన కార్యకర్తలను ఓదార్చడానికి కూడా ఆయన అంతగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవడం లేదు. తన ఐదేళ్ల పాలన పాపాలు తనను చుట్టుకుంటూంటే ఎలా తప్పించుకోవాలా అని బెంగళూరులో మేథోమథనం చేస్తున్నారు.
ముఖ్యనేతలంతా తప్పించుకోలేని విధంగా చట్ట ప్రయోగం
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాత్రి ఏడు గంటలయితే.. సీఐడీని, కొల్లి రఘురామిరెడ్డిని పిలిపించుకుని ఈ వారం ఎవర్ని అరెస్టు చేద్దాం.. ఎవరి ఆస్తులు ధ్వంసం చేద్దామని ప్లాన్ చేసుకునేవారు. ఆధారాలు లేకపోయినా జగన్ ను సంతృప్తి పరచడానికి వారు చేసేవారు. ఇప్పుడు వారంతా బలైపోయారు. ఐపీఎస్ సంజయ్ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. సీతారామాంజనేయులు కెరీర్ ఎలా ముగుస్తుందో చూస్తున్నారు. కొల్లి రఘురామిరెడ్డి, పీవీ సునీల్ కు ఇంకా టైం రాలేదు. ఇలా ముఖ్యనేతలు, అధికారులు అందరూ.. చట్టపరమైన కబంధహస్తాల్లో ఇప్పటికే చిక్కుకున్నారు. మెల్లగా అవి దగ్గరకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. జగన్ తన మానసిక ఆనందం కోసం అరాచకాల వల్ల ఇప్పుడు ఎంతో మంది మానసికంగా దెబ్బతినిపొతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా ఉండనుంది.