ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఐఐటీ ఫలితాలు ప్రకటించినప్పుడు, నీటి ర్యాంకులు వెల్లడించినప్పుడు పత్రికల్లో ప్రకటనలు హోరెత్తుతాయి. ఆ సమయంలో ఒక్కో విద్యార్థి ఫోటో అన్ని కాలేజల ప్రకటనల్లోనూ దర్శనమిస్తూంటాయి. మా దగ్గర చదివాడంటే మా దగ్గర చదివాడని ప్రకటిస్తూంటారు. నిజానికి ఆ విద్యార్థి ఇంకెక్కడో చదివి ఉంటాడు. ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఫోటోవాడుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయబోయే సర్పంచ్ అభ్యర్థులు కూడా అలాగే అవబోతున్నారు. గెలిచిన వాళ్లను మా పార్టీనే అని అన్ని పార్టీలు ప్రకటించుకోనున్నాయి.
పార్టీ గుర్తు లేని పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం అధికారికంగా గురువారం నుంచి ప్రారంభమవుతోంది. తొలి విడత నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. రెండు వారాల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇవి పార్టీ గుర్తింపు లేని ఎన్నికలు. పార్టీ గుర్తులు ఉండవు. పార్టీలు మద్దతు ఇవ్వవు. పరోక్షంగా మా పార్టీ అభ్యర్థే అని ప్రచారం చేసుకుంటారు. పార్టీల రంగులు వాడుకుంటారు. అంత వరకూ కానీ గెలుపులు కూడా పార్టీ ఖాతాలో పడవు. వ్యక్తిగతంగానే సర్పంచ్లు గెలుస్తారు.
గెలిచిన వాళ్లది ఏ పార్టీ ?
ఏ పార్టీ సానుభూతిపరుడో గెలిచిన వ్యక్తి గురించి ఆ గ్రామంలో వారికి తెలుసు. అయితే వారు ఎన్నికల్లో పార్టీలను చూసి ఓటు వేయరన్నది నిజం. గ్రామంలో ఉండే పరిస్థితులు ఇతర అంశాల ఆధారంగానే గెలిపిస్తారు. గెలిచిన వ్యక్తికి బంపర్ ఆఫర్లు వస్తాయి. మా పార్టీ అభ్యర్థిగా.. మా పార్టీ సానుభూతిపరుడిగా ఉండు అని అన్ని పార్టీలు వస్తాయి. కొంచెం మేజర్ పంచాయతీ అయితే.. వెంటనే అడిగింది ఇచ్చేసి కండువాలు కూడా కప్పేస్తారు. గెలవడానికి ఏ పార్టీ మద్దతిచ్చిందన్న విషయం పక్కన పెడితే గెలిచిన తర్వాత అతను ఏ పార్టీ అంటే.. అతనిది ఆ పార్టీ అనుకోవాలి.
అధికార పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్
ఇలాంటి రాజకీయాలు చేయడానికి అధికార పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే పవర్ చేతుల్లో ఉంటుంది. అయితే కేసులు లేకపోతే తాయిలాలు ఇచ్చి గెలిచిన వారందర్నీ తమ ఖాతాలో వేసుకోవచ్చు. తమ పార్టీ వారే గెలిస్తే సమస్య ఉండదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ.. తమ నేతలు గెలిచినా కాంగ్రెస్ వారని చెప్పుకుంటున్నారని రెడీమేడ్ విమర్శలు రెడీ చేసుకుని ఉండవచ్చు.