ఎన్నికలకు ముందు కొంత మంది ఎమ్మెల్సీలు పార్టీకి మద్దతుగా లేరని వారిపై అనర్హతా వేటు వేసింది వైసీపీ. మండలి చైర్మన్ పేరుతో అర్థరాత్రి ఉత్తర్వులు వచ్చేవి. నిజానికి వారెవరూ పార్టీ మారలేదు. కానీ పార్టీలో ఉండరని క్లారిటీ వచ్చింది. అందుకే వివరణలు..గట్రా ఏమీ తీసుకోకుండానే అనర్హతా వేటు వేసేవాళ్లు. అలా రఘురాజు అనే ఎమ్మెల్సీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కూడా కొట్టివేసింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వేరే పార్టీల్లో చేరిపోయారు కానీ.. రాజీనామాలను ఆమోదించడానికి వైసీపీకి చెందిన మండలి చైర్మన్ మోషేన్ రాజుకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.
కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్ వంటి వారు రాజీనామాలు చేశారు. ఇతర పార్టీల్లోనూ చేరిపోయారు. చాన్స్ దొరికితే అనర్హతా వేటు వేయాల్సిన వైసీపీ మండలి చైర్మన్ మాత్రం.. వారు రాజీనామాలు ఇచ్చినా ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. తమ పదవులకు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నాయి. చివరికి వారిలో జయమంగళ వెంకటరమణ కోర్టుకు వెళ్లారు. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిది.
నిజానికి రాజీనామా చేసిన వారిని బతిమిలాడి అయినా పార్టీలోనే ఉంచుకుందామని ప్రయత్నించారు వారు రాజీనామా చేసినప్పటి నుండి అనేక సార్లు రాయబారాలు నడిపారు. టీడీపీలో కూటమి పార్టీల్లో ప్రాధాన్యం ఉండదని వైసీపీలోనే ఉండాలని కోరారు. కానీ అందరూ నిరాకరించారు. పదవులు పోయినా పర్వాలేదు వైసీపీలో మాత్రం ఉండలేమన్నారు. ఇంత ఛీ కొడుతున్నా వారి రాజీనామాలు ఆమోదించడానికి వైసీపీకి చెందిన చైర్మన్ కి హైకమాండ్ ఆదేశాలు ఇవ్వలేదు.
యన పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి మండలిలో వైసీపీకి బలం ఉంది. అందుకే ఎమ్మెల్సీలు సభకు వస్తున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఇంకెంత మంది ఆ పని చేస్తారోనని వైసీపీ కంగారు పడుతోంది. ఎందుకంటే రాజీనామాలు చేస్తే ఒక్క పదవి కూడా తిరిగి వైసీపీకి రాదు. అందుకే.. ఏ నిర్ణయం తీసుకోవడంలేదు. అయితే ఎన్నికలకు ముందు ఒకలా… ఇప్పుడు మరోలా వ్యూహరిస్తూ అందితే జుట్టు.. అందగకపోతే కాళ్లు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ తీరుపై .. సొంత నేతలు కూడా జాలి పడుతున్నారు.