కథాబలం ఉన్న సినిమాలు చేయడం, దాన్ని టెక్నికల్ గా గ్రాండ్ గా చూపించడం గుణశేఖర్ స్టైల్. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సూపర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఓ చిన్న సినిమా తీశారు. అదే ‘యుఫోరియా’. ఇందులో స్టార్లు లేరు. హడావుడి లేదు. కానీ ఆయన ఎప్పుడూ నమ్ముకొన్న `కథ` మాత్రం బలంగా ఉండేలా కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు టీజర్ వదిలారు.
గౌతమ్ మీనన్, భూమిక చావ్లా మినహాయిస్తే నటీనటులంతా దాదాపుగా కొత్తవారే. టీజర్ చూస్తే… డ్రగ్స్ మత్తులో పాడైపోతున్న యువతని దార్లో పెట్టడానికి గుణశేఖర్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీజర్ లో సీసీఎల్ (ఛైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా) అనే ఓ మాట వినిపించింది. బహుశా.. గుణశేఖర్ ఎంచుకొన్న కథాంశం కూడా దీనిపైనే ఉండొచ్చు. మాదక ద్రవ్యాల బానిసత్వంలో యువత కొట్టిమిట్టాడుతోంది. దాన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలొచ్చాయి. యుఫోరియాలో గుణశేఖర్ అంతకు మించి ఏదైనా చెబితే, ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్సుంది. గుణ శేఖర్ తన పద్ధతి, పంధా మార్చుకొని, కొత్త తరహా ప్రయత్నం చేశాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. టెక్నికల్ టీమ్ లోనూ దాదాపుగా ఇది వరకు గుణశేఖర్ తో పని చేయని నిపుణులే ఉన్నారు. మరి వాళ్లతో గుణశేఖర్ ఎలాంటి పనితనం రాబట్టుకొన్నాడో చూడాలి. వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలన్నా, గుణశేఖర్ పై మరోసారి స్టార్స్ దృష్టి పడలాలన్నా యుఫోరియాతో హిట్ కొట్టాల్సిందే. మరి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అవుతుందో..?!