ఇప్పుడు హైదరాబాద్లో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కోకాపేట. అక్కడ ప్రభుత్వం వేలం వేస్తున్న భూములు ఎకరానికి రూ.150 కోట్లు దాటిపోయాయి. రేపు రెండు వందల కోట్లు కావొచ్చని అంటున్నారు. గతంలో ప్రభుత్వం వద్ద భూములు వేలంలో కొనుగోలు చేసిన సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు లగ్జరీ ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఎన్ని అంతస్తులు అయినా కట్టుకునే స్వేచ్ఛ ఉండటంతో బిల్డర్లు ఆకాశానికి దగ్గర చేస్తున్నారు. అన్నీ లగ్జరీ ఇళ్లే. ఒక్కటి మామూలు అపార్టుమెంట్ లేదు. ఒక్కొక్కటి ప్రారంభ ధరే నాలుగు కోట్లకుపైగా ఉంటుంది. మరి వాటిని ఎవరు కొంటున్నారు అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. నిజంగానే కోకాపేటలో బడా బిల్డర్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో బుకింగులు నిరాశజనకంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇళ్లు కావడంతో.. అలాంటి వర్గం వారు పెట్టుబడికి ఆలోచిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో సగం కూడాఇప్పటికీ బుకింగ్ లు కాలేదని అంటున్నారు.
ఇలాంటి ప్రాజెక్టుల్లో బిల్జర్లు ఎక్కువగా ఆశలు పెట్టుకునేది ఎన్నారైల నుంచే. అమెరికాలో డాలర్లు సంపాదించేసి.. ఇక్కడ పెట్టుబడులు పెడతారని.. ఎంత రేటు పెట్టినా కొంటారన్నట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నారైలు కూడా .. ఒక్క సారిగా ఇంత పెద్ద మొత్తంలో ఓ ఇంటిపై పెడితే.. అది వచ్చే ఐదేళ్లు, పదేళ్లకూ అలాగే ఉంటే మొత్తానికి నష్టపోతామని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి అల్ట్రా లగ్జరీ మార్కెట్ జోరు మీద ఉన్నప్పటికీ.. డిమాండ్ తో పోలిస్తే సప్లయ్.. రెట్టింపు ఉండటంతో.. మరికొంత కాలం లగ్జరీ ఇళ్ల బుకింగులు .. లాంచింగ్లతో పోలిస్తే తక్కువే ఉండనున్నాయి. ఇది వాటిపై పెట్టుబడి పెడుతున్న రియల్టర్లకు సమస్యగా మారనుంది.
