రోషన్ కనకాల మోగ్లీ సినిమాతో వస్తున్నాడు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజాగా ట్రైలర్ వదిలారు. విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ ‘రాజు గారి ఏడుగురి కొడుకులు.. చేపల వేట’ కథ చెప్పడంతో ట్రైలర్ మొదలుపెట్టారు. కథ తర్వాత ఓ అడవికి షిఫ్ట్ అవుతుంది. చెవిటి-మూగ అయిన అమ్మాయి ఫిల్మ్ యూనిట్లో గ్రూప్ డ్యాన్సర్. ఆ అమ్మాయిని ఆట పట్టించాలని చూసిన హీరోకి వార్నింగ్ ఇస్తాడు మోగ్లి. అదే అమ్మాయిని ఇష్టపడతాడు విలన్ బండి సరోజ్. ఆ తర్వాత ప్రేమ కోసం ఎలాంటి యుద్ధం జరిగిందనేది మిగతా కథ.
మోగ్లీ కోసం సందీప్ రాజ్ మరో ప్రేమకథని రాశారు. ఐతే ఈసారి హీరోని పోరాటపటిమ వున్న క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు. చెవిటి-మూగ హీరోయిన్ తో ప్రేమ కాస్త కొత్తగా వుంది. ”ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి’అనే డైలాగ్ లో హనుమాన్ విగ్రహాన్ని చూపించాడు రామాయణ శైలి కథనాన్ని గుర్తుచేసింది. రోషన్ కనకాల మోగ్లీగా పాత్రలో కనిపించిన తీరు బావుంది. విలన్ గా బండి సరోజ్ కుమార్ ప్రజెన్స్ ఆసక్తిరకంగా వుంది. సినిమా షూటింగ్ నేపధ్యంలో వచ్చే సీన్స్ లో డైరెక్టర్ సందీప్ కొన్ని సెటైర్లు కూడా వేశాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి ప్రేమకథ వచ్చి చాలా కాలమైయింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
