తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. తర్వాత మూడు రోజుల పాటు సామాన్య ప్రజలకు అనుమతి ఉంటుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు సినీ, క్రీడా రంగాల దిగ్గజాలు తరలి వస్తున్నారు. ఒలింపిక్ స్వర్ణ పతకాల లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం వంటి ప్రభుత్వ ప్రణాళికలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు.
సమ్మిట్‌లో 27 ప్రత్యేక సెషన్లు ఉంటాయి. ఇవి వివిధ రంగాలపై చర్చలు నిర్వహిస్తారు. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటిస్తారు. క్రీడా దిగ్గజాలు ఒలింపిక్ పతకాల సాధనకు సూచనలు, లక్ష్యాలు చర్చిస్తారు. సినిమా రంగంలో స్టూడియోల నిర్మాణానికి అవసరమైన ఎక్విప్మెంట్, టెక్నాలజీ, స్థలాలపై చర్చలు జరుగనున్నాయి.
క్రీడా రంగంలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత పీ.వి. సింధు, మాజీ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్, షూటింగ్ ఒలింపిక్ పతకవిజేత గగన్ నారంగ్, మాజీ బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జ్వాలా గుత్తా ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్లో పాల్గొంటారు. సినిమా రంగం నుంచి రాజమౌళి, రితేష్ దేశ్ ముఖ్, తెలుగు సినిమా డైరెక్టర్ సుకుమార్, వంటి వారు హాజరవుతారు. తొమ్మిదో తేదీన ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీత కచేరీ ఉంటుంది. తెలంగాణ నృత్య కళాకారురాలు పద్మజారెడ్డి ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇస్తారు. బుధవారం నుంచి సామాన్య ప్రజలు కూడా సమ్మిట్ కు వెళ్లవచ్చు. ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
