సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు బెయిల్ లభించింది. ఆయన పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పని చేసినప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించి కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో కోర్టులో లొంగిపోయారు. పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ఆయన దిగువ కోర్టులో పిటిషన్ల దండయాత్ర చేశాడు. కానీ హైకోర్టుకు మాత్రం వెళ్లలేదు. ఇప్పుడు దిగువ కోర్టులోనే ఊరట లభించింది. బెయిల్ మంజూరు అయింది.
వైసీపీ హయాంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. సీఐడీ చీఫ్గా ఉండి చేయకూడనన్ని పనులు చేశాడు. మార్గదర్శిపై కనీస సాక్ష్యాలు లేకుండా దాడులు చేయడం, ఆ వ్యాపార సంస్థను ఆర్థికంగా చిదిమేయాలని చూడటంతో పాటు.. చాలా ఘోరమైన పనులు చేశారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసుల్లో అవసరం లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి ఆయన చేసిన ఈ తప్పులపై ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. అవినీతి కేసులోనే జైలుకు వెళ్లారు.
ఐపీఎస్ అధికారిగా ఉండి ఆయన చేసిన నిర్వాకాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అందుకే సుదీర్ఘకాలం జైల్లో ఉన్నా ఆయనకు సానుభూతి తోటి అధికారుల్లోనే కనిపించలేదు. ఆయన కోసం జగన్ రెడ్డి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. చివరికి తప్పనిసరిగా… తన బెయిల్ కోసం తానే ప్రయత్నాలు చేసుకుని.. రిలీఫ్ పొందారు.
