దిల్ రాజు అనుభవం ఎందుకో ఈమధ్య కాసులు రాల్చడం లేదు. వరుస పరాజయాలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే కొంతకాలం ఆయన కొత్త కథలేవీ వినకూడదని నిర్ణయించుకొన్నారు. ఎక్కడి సినిమాల్ని అక్కడ ఆపి, రీ వర్క్ చేయాలని నిర్ణయించుకొన్నారు. కొంత బ్రేక్ తరవాత ఆయన మళ్లీ యాక్టీవ్ అయ్యారు. 2026లో ఆయన బ్యానర్ నుంచి 6 సినిమాలు రాబోతున్నాయి. అందులో `రౌడీ జనార్థన` ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకుడు. టైటిల్ గ్లింప్స్ ఈరోజు విడుదల చేశారు. గ్లింప్స్ చాలా ప్రామిసింగ్ గా వుంది. అయితే రక్తపాతం ఎక్కువైంది. స్వతహాగా దిల్ రాజు సినిమాలంటే క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాలే. రక్తపాతానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ‘రౌడీ జనార్థన’ గ్లింప్స్ లో అంతా రక్తమే కనిపించింది. బహుశా ఆయన బ్యానర్ లో ఇంత రక్తం పారుతున్న సినిమా ఇదేనేమో. ఈ మార్పు దేని కోసం అని అడిగితే.. దిల్ రాజు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
ఇప్పటి ట్రెండ్ లో పెద్ద పెద్ద హిట్ అవుతున్న సినిమాలన్నీ… ఈ జోనర్లో తీసినవే అని, అందుకే ట్రెండ్ పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దిల్ రాజు లాంటి నిర్మాత కూడా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందేనా? అని అడిగితే..’ఫాలో అవ్వకపోతే జనం మనల్ని పక్కన పెడతారు’ అని నిర్మొహమాటంగా సెలవిచ్చారు. మారుతున్న పోకడల్ని బట్టే సినిమా ఉండాలి. మార్పు మంచిదే. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. దిల్ రాజుకు హిట్ అత్యవసరం. అందుకే ట్రెండ్ ని ఫాలో అవ్వక తప్పడం లేదు.
ఈ మీడియా మీట్ లో దిల్ రాజు Q&A విషయంలో చాలా జాగ్రత్తలు వహించారు. అనవసరమైన ప్రశ్నలకు సమాధానం చెబితే.. లేనిపోని కాంట్రవర్సీల జోలికి వెళ్లాల్సివస్తుందనుకొన్నారేమో `సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి` అని ముందే పీఆర్వోలతో పాత్రికేయులకు కబురు అందించారు. ఆ తరవాత ప్రెస్ మీట్ లో అలాంటి ప్రశ్నలు ఎదురైనా సమాధానాలు ఇవ్వకుండా సున్నితంగా తప్పించుకొన్నారు. దిల్ రాజులో ఇది మరో మార్పు.


