299 టీఎంసీలకు అంగీకారం చెప్పడమే కాదు, కృష్ణా నదీ జలాల నిర్వహణ బాధ్యతలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కి అప్పగిస్తూ సంతకాలు చేశారన్న ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుడు సమాచారంతో అయోమయానికి గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా తెలంగాణ భవన్లో హరీష్ రావు పీపీటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు దక్కాల్సిన 577 TMCల సాగునీటి వాటా కోసం తాము గట్టిగా పోరాడామని హరీష్ రావు వివరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నీటి కేటాయింపులపై దృష్టి పెట్టకుండా, కేవలం రాజకీయ బురదజల్లేందుకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా తాము సంతకాలు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. సాగునీటి రంగంపై శ్వేతపత్రం పేరుతో ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుల నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన వివరించారు.
ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలిపిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాత మినిట్స్ బుక్స్‌ను తప్పుగా చూపిస్తోందని విమర్శించారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని, ఇది తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న రూ. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు వెచ్చించిన నిధులు, దానికి సంబంధించిన బ్యాంకు రుణాల వివరాలను ఆయన బహిర్గతం చేశారు. కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చిన జీవధార అని ఆయన పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టునే పనికిరాకుండా చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. చిన్నపాటి సాంకేతిక లోపాలను సరిదిద్ది సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వం ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. నీటిని ఎత్తిపోయకుండా మోటార్లను ఆపేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి లేవనెత్తిన కీలక ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పలేదు. నీటిని ఎత్తిపోసుకునే ప్రాంతాలను మేడిగడ్డ, శ్రీశైలంకు ఎందుకు మార్చారో మాత్రం నేరుగా చెప్పలేకపోయారు. 299 టీఎంసీలు చాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించి సంతకం చేసిందని రేవంత్ అంటే..తాము చేయలేదని హరీష్ రావు వ్యక్తిగతంగా సమాధానం ఇచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
