భారత్‌పై అకారణ ద్వేషం చూపుతున్న బంగ్లాదేశ్ లో ప్రజలు ఎన్నుకోని పాలకులు ఆ దేశ క్రికెట్ పైనా తమ ప్రతాపం చూపుతున్నారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలు అయిన హిందుులపై జరుగుతున్న దాడులు, ప్రతీ దానికి భారత్ ను నిందించే అక్కడి పాలకుల తీరుతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఐపీఎల్ బహిష్కరణ ,ప్రపంచకప్ వేదికల మార్పు డిమాండ్ వరకు వెళ్లింది.
బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుల్ రెహ్మాన్‌ను ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీల రక్షణ విషయంలో భారత్‌లో వ్యక్తమవుతున్న నిరసనల దృష్ట్యా భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒక ఆటగాడికి భారత్‌లో రక్షణ కల్పించలేనప్పుడు, మొత్తం జట్టుకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది.
ముస్తాఫిజుర్ తొలగింపును తమ దేశానికి జరిగిన అవమానంగా భావిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ వేదికగా జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీ ని కోరాలని నిర్ణయించింది. ఒకవేళ వేదికలు మారకపోతే టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే భారత్-బంగ్లా మధ్య జరగాల్సిన పలు సిరీస్‌లను బీసీసీఐ హోల్డ్‌లో పెట్టింది. ఒకవేళ ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలను బహిష్కరిస్తే ఐసీసీ నుంచి వచ్చే భారీ నిధులను బంగ్లాదేశ్ కోల్పోయే ప్రమాదం ఉంది. పాకిస్థాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ కూడా క్రికెట్ పరంగా ఏకాకి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
