తక్కువ ధరకే ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో వేల మందిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ. 3,000 కోట్లు ఉంటుందని సీసీఎస్ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నాలుగేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత, పోలీసులు ఈ కేసులో కీలకమైన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ , అతని బృందం ఏ విధమైన అనుమతులు లేకుండానే అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని నమ్మించి మధ్యతరగతి ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేశారు. కానీ ఇళ్లు కట్టలేదు. ఇప్పటివరకు ఈ సంస్థపై 64 కేసులు నమోదు కాగా, వాటన్నింటిపై సీసీఎస్ ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి.
తాజా ఛార్జ్‌షీట్‌లో ప్రధానంగా అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదు కాగా, వీటిపైనే ఇప్పుడు ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులకు ప్లాట్లు ఇవ్వకపోగా, ఆ డబ్బును లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ కుంభకోణంలో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా, మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. సంస్థ డైరెక్టర్లు, కీలక ప్రతినిధులు ఈ మోసంలో భాగస్వాములైనట్లు అభియోగాలు నమోదయ్యాయి. అనుమతులు లేని భూములను చూపించి, నకిలీ బ్రోచర్లు సృష్టించి ప్రజలను ఏ విధంగా వంచించారో పోలీసులు ఈ ఛార్జ్‌షీట్‌లో వివరించారు.
నాలుగేళ్లుగా తమ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ఈ ఛార్జ్‌షీట్ కొంత ఉపశమనం కలిగించే అంశమే. వసూలు చేసిన సొమ్మును రికవరీ చేయడం, నిందితుల ఆస్తులను అటాచ్ చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించినట్లు సీసీఎస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితుల సొమ్ము వెనక్కి ఇప్పిస్తేనే వారికి న్యాయం జరిగినట్లవుతుంది.
