అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఒక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్, క్రీడల్లో రాజకీయాలను చొప్పించి భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇతర చిన్న జట్లు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుతూ దూసుకుపోతుంటే, బంగ్లాదేశ్ మాత్రం కీలకమైన ప్రపంచకప్ వంటి టోర్నీని బహిష్కరించి ఇంటికే పరిమితమైంది. భద్రతను సాకుగా చూపి తీసుకున్న ఈ నిర్ణయం, ఆ జట్టు సాధించిన ఇన్నాళ్ల ప్రగతిని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. బంగ్లా స్థానాన్ని ఇతర జట్లు చాలా వేగంగా భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో భారత్ పొరుగుదేశం నేపాల్ బలమైన జట్టుగా మారే అవకాశాలు కరిగాయి.
భారత్‌లో భద్రత ఉండదా ?
భారత్‌లో బంగ్లాదేశ్ క్రీడాకారులకు కానీ, ఆ జట్టుకు కానీ ఎలాంటి వ్యతిరేకత లేదా భద్రతా సమస్యలు లేవు. భారత్ ఎప్పుడూ అతిథి దేశాలకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తుంది. కానీ, బంగ్లాదేశ్‌లోని కొన్ని రాజకీయ శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా సెంటిమెంట్‌ను రగిల్చి, క్రీడలను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశాయి. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ జట్టు విడుదల చేయడం వంటి చిన్న విషయాలను రాజకీయం చేసి, భద్రతా సాకులు చూపడం ద్వారా ఐసీసీ తిరస్కారానికి గురైంది. ఈ కుట్రల ఫలితంగా ఆ దేశ క్రికెట్ బోర్డు తీసుకున్న అనాలోచిత నిర్ణయం, ప్రపంచ క్రికెట్ పటంలో బంగ్లాదేశ్‌ను ఒంటరిని చేసింది.
ఆర్థిక పతనం , నైతిక దెబ్బ
ప్రపంచకప్ నుంచి వైదొలగడం అనేది కేవలం ఒక టోర్నీకి దూరం కావడం మాత్రమే కాదు, అది ఆ దేశ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని ఆర్థిక దెబ్బ. ఐసీసీ నుంచి వచ్చే సుమారు 20 మిలియన్ డాలర్ల ఆదాయం, ప్రసార హక్కులు , స్పాన్సర్షిప్లను కోల్పోవడంతో పాటు, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకున్న బంగ్లా క్రికెట్ ప్రతిష్ట మంటగలిసింది. క్రీడాకారులకు అంతర్జాతీయ అనుభవం లభించకపోవడమే కాకుండా, ఐసీసీ నిబంధనల ఉల్లంఘన వల్ల భవిష్యత్తులో ఆ జట్టు క్వాలిఫయర్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాను రీప్లేస్ చేయనున్న నేపాల్
ప్రస్తుత ప్రపంచకప్‌లో నేపాల్, అమెరికా వంటి జట్లు అద్భుతాలు చేస్తూ దిగ్గజ జట్లకు దడ పుట్టిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ వంటి జట్లు సెమీస్ రేసులో నిలుస్తుంటే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం ఇంట్లో కూర్చుని టీవీల్లో మ్యాచ్‌లు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజకీయ అవసరాల కోసం క్రీడలను బలిపశువును చేస్తే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో బంగ్లాదేశ్ ఉదాహరణగా నిలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆ దేశ క్రికెట్ వ్యవస్థ పతనం అంచుకు చేరింది, దీని నుండి కోలుకోవడానికి మరో దశాబ్దం పట్టవచ్చు. ఒకరి తప్పులే మరొకరి వెలుగులకు కారణం. ఇప్పుడు చిన్న జట్లు..బంగ్లాకు ధ్యాంక్స్ చెప్పాల్సిందే.
