మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో వంద వరకూ కాంగ్రెస్ ఖాతాలో పడేలా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా మున్సిపాలిటీలను కాపాడుకోలేకపోయింది. కాంగ్రెస్ లో చేరి బహిరంగంగా బీఆర్ఎస్ కోసం పని చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే మాత్రం.. తన పరిధిలో ఉన్న ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో గెలిపించారు. ఇస్నాపూర్ లో అతి పెద్ద పార్టీగా నిలిపారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. బీఆర్ఎస్ సాధించిన విజయాలు ఎక్కువగా మెదక్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో బీఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చివరికి జగదీష్ రెడ్డి నియోజకవర్గం సూర్యాపేటలోనూ వెనుకబడింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీనే హవా చూపిస్తోంది. కార్పొరేషన్లలో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకూ మంచిర్యాల కార్పొరేషన్ లో రెండు డివిజన్లలో ఓట్ల లెక్కింపు వివరాలు బయటకు వచ్చాయి. ఆ రెండుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు ఉన్న మున్సిపాలిటీల్లో గెలుపొందడమే ముఖ్యమన్నట్లుగా ఎన్నికలకు ముందు ఆ నేతలు వ్యవహరించారు. సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక వంచి చోట్ల గెలిస్తే చాలన్నట్లుగా పోరాడారు. అలాంటి చోట్ల వారికి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇతర ప్రజా ప్రతినిధులు మాత్రం తమ పట్టును నిరూపించుకోలేకపోయారు. ఫలితాలపై సాయంత్రానికి ఓ స్పష్టత వస్తుంది. బీఆర్ఎస్ ఎంత పోరాడింది.. బీజేపీ ఎంత పుంజుకుందన్న క్లారిటీ వస్తుంది.
