తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్, తన పార్టీ తమిళగ వెట్రి కళగం మేనిఫెస్టోతో అట్టహాసంగా ముందుకు వచ్చారు. అయితే, ఆ మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలు ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలేదు. అది పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో పోసి వడ్డించినట్లుగా ఉందని చెబుతున్నారు. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు వల్లెవేస్తున్న పాత వాగ్దానాలనే విజయ్ మళ్లీ తన మేనిఫెస్టోలో పెట్టారు.
నీట్ రద్దు – అందరూ వాడేసిన హామీ
విజయ్ ప్రకటించిన ప్రధాన వాగ్దానాల్లో ముఖ్యమైన నీట్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటివి తమిళ రాజకీయాల్లో ఎప్పటి నుంచో నలుగుతున్న అంశాలే. ఏళ్ల తరబడి అధికార పార్టీలు వీటిపై పోరాడుతున్నామని చెబుతున్నా, విజయ్ కూడా అవే పాయింట్లు పట్టుకుని వేలాడటం ఆయన రాజకీయ పరిణతిపై సందేహాలు రేకెత్తిస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన విజన్ , విజయ్ మార్క్ అని చెప్పుకోదగ్గ ఒక్క వినూత్న పథకాన్ని కూడా ఆయన ప్రజల ముందు ఉంచలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికలు వారంలో పెట్టుకుని మేనిఫెస్టోనా?
మేనిఫెస్టో విడుదల చేయడంలో జరిగిన జాప్యం కూడా పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఇతర ప్రధాన పార్టీలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లిన తర్వాత, చివర్లో విజయ్ ఇలాంటి రొటీన్ వాగ్దానాలతో రావడం వల్ల ఓటర్లలో పెద్దగా ఆసక్తి కలగడం లేదు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి , అవినీతి రహిత పాలన వంటి పదాలు వినడానికి బాగున్నా, వాటిని ఆచరణలోకి తీసుకువచ్చే పక్కా ప్రణాళిక మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కేవలం సినిమా డైలాగుల తరహాలో గంభీరమైన ప్రకటనలకే ఆయన పరిమితమయ్యారు.
కొత్త తరం నాయకుడి మేనిఫెస్టో కాదు!
విజయ్ మేనిఫెస్టో విశ్లేషిస్తే, ఇది ఒక కొత్త తరం నాయకుడి ఆలోచనలా కాకుండా, పాత పార్టీల మేనిఫెస్టోలను కాపీ చేసి పేస్ట్ చేసినట్లుగా ఉంది. యువతను ఆకట్టుకోవడానికి డిజిటల్ విప్లవం గురించి మాట్లాడతారని ఆశించిన వారికి, మళ్లీ అవే పాత సామాజిక న్యాయం పాటలు నిరాశను మిగిల్చాయి. గ్లామర్ ఉంది కానీ కంటెంట్‌లో దమ్ము లేదనే విమర్శలను విజయ్ ఎలా అధిగమిస్తారో చూడాలి. తమిళనాడు ఓటర్లు కేవలం ఇమేజ్ను చూసి ఓటు వేస్తారా లేక మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని గుర్తిస్తారా అన్నది వేచిచూడాలి.
