దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పడిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరపైకి తెచ్చిన ప్రోరాటా పద్ధతి.. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ సమతుల్యతను కాపాడటానికి ఒక మధ్యేమార్గంగా కనిపిస్తోంది.
అన్ని రాష్ట్రాలకు 50 శాతం పెంపు
ఈ ప్రతిపాదనలోని ప్రధాన బలం ఏమిటంటే.. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను కచ్చితంగా 50 శాతం మేర పెంచడం. దీనివల్ల మొత్తం సభ పరిమాణం పెరిగినప్పటికీ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తి ఏమాత్రం మారదు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న సుమారు 24 శాతం వాటా భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుంది. ఫలితంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉండదు. సంఖ్యాపరంగా సీట్లు పెరిగినా సభలో ఓటింగ్ శాతం పరంగా దక్షిణాది పట్టు అలాగే ఉంటుంది.
జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాది వాటా 18 శాతానికి పడిపోయే ప్రమాదం
కేవలం జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాల బలం పెరిగి దక్షిణాది వాటా 18 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ 50 శాతం పెంపుదల సూత్రం దక్షిణాది ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వంటి జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు అదనపు ప్రయోజనం కలగకుండా, అదే సమయంలో కేరళ లేదా తమిళనాడు వంటి రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా ఈ విధానం సమన్యాయం చేకూరుస్తుంది. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది గొంతుక బలహీనపడకుండా చూడటమే ఈ ఫార్ములా వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.
సంఖ్యాపరంగా ఉత్తరాది ఎక్కువే..కానీ ఇప్పుడున్న నిష్పత్తిలోనే !
సంఖ్యాపరంగా చూసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్రాల ప్రభావం పెరుగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఓవరాల్గా దక్షిణాదికి లభించే 129 స్థానాలు 194కి పెరుగుతుండటం సానుకూల అంశం. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించకుండా సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో ఈ ప్రోరాటా పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుందని మేధావులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగ సవరణలు , సాంకేతిక అంశాలపై ప్రభుత్వం ఇచ్చే స్పష్టతపైనే ఈ కొత్త ఫార్ములా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
