ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగానికి , సామాన్య గృహ యజమానులకు ఊరటనిస్తూ ప్రభుత్వం వేకెడ్ ల్యాండ్ ట్యాక్స్‌లో భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన పన్ను భారం సగానికి తగ్గనుంది. వీఎల్టీ అంటే ఖాళీ స్థలంపై విధించే పన్ను. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఖాళీ ప్లాట్లు లేదా స్థలాలపై స్థానిక సంస్థలు ఏటా ఈ పన్నును వసూలు చేస్తాయి. సాధారణంగా స్థలం రిజిస్ట్రేషన్ విలువలో నిర్ణీత శాతాన్ని పన్నుగా నిర్ణయిస్తారు. ఏదైనా భవన నిర్మాణం ప్రారంభించడానికి ముందు లేదా ప్లాన్ అప్రూవల్ సమయంలో, ఆ స్థలానికి సంబంధించిన పాత వీఎల్టీ బకాయిలతో పాటు, నిర్మాణ సమయానికి సంబంధించిన పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, నిర్మాణ కాలంలో ( వర్తించే వీఎల్‌టీని 50 శాతానికి తగ్గించారు. అంటే గతంలో వంద శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణ అనుమతులు తీసుకునే సమయంలో ఈ మినహాయింపు వర్తిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో పెంచిన పన్నుల భారంతో ఇబ్బంది పడుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి ఇది పెద్ద ఊరటగా మారింది.
ఈ నిర్ణయం సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యులకు ప్లాన్ అప్రూవల్ సమయంలో అయ్యే ఖర్చు తగ్గుతుంది. నిర్మాణానికి అయ్యే అదనపు భారంలో కొంత ఉపశమనం లభిస్తుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వెంచర్లు నిర్మించే బిల్డర్లకు ఈ 50 శాతం తగ్గింపు వల్ల లక్షల రూపాయల పొదుపు అవుతుంది. ఇది నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, తద్వారా సామాన్యులకు అందుబాటు ధరలో ఇళ్లు అందించడానికి మార్గం సుగమం చేస్తుంది.
ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, మున్సిపల్ శాఖకు రావాల్సిన ఆదాయం కూడా సకాలంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. పారదర్శకమైన పాలనలో భాగంగా ప్రజలపై పన్నుల భారం తగ్గించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
