హరీష్ రావును బయట రాజకీయంగానే కాదు నేరుగా టార్గెట్ చేయాలని కవిత నిర్ణయించుకున్నారు. తన కొత్త పార్టీని మేలో ప్రకటిస్తానని .. సిద్ధిపేట నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నానని ఆమె చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఈ పార్టీ అడుగులు వేస్తుందని ఆమె వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని, పార్టీ నాయకత్వం ఉద్యమకారులను విస్మరించిందని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని, కేవలం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమేనని పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె బలపరిచిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించడం ఆమెకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ ప్రకటన అనంతరం త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు.
ఎన్నికల బరిలో దిగే అంశంపై స్పందిస్తూ, తాను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కవిత స్పష్టం చేశారు. అయితే, తన మొదటి ప్రాధాన్యత సిద్దిపేట అని, రెండో ఛాయిస్‌గా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సిద్దిపేటలో పోటీ చేయడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆమె భావిస్తున్నారు.
ఈ కొత్త పార్టీ స్థాపన ద్వారా తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని పార్టీ నిర్మాణం ఉంటుందని ఆమె సూచించారు. నేను చట్టసభను వదిలి వెళ్తున్నాను, కానీ ఒక శక్తిగా తిరిగి వస్తాను అని కౌన్సిల్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మే నెలలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.
